మహిళల రక్షణకు..

న్యూఢిల్లీ, డిసెంబర్‌ 27 (జనంసాక్షి): మహిళలకు రక్షణ, భద్రత కల్పించడమే ప్రభుత్వాల ప్రథమ ప్రాధాన్యం కావాలని ప్రధాని డాక్టర్‌ మన్మోహన్‌సింగ్‌ ఉద్ఘాటించారు. దేశంలోని మహిళలపై పెరుగుతున్న దాడుల పట్ల ఆయన ఆందోళన వ్యక్తంచేశారు. గురువారంనాడు ఇక్కడ జరిగి జాతీయ అభివృద్ధి మండలి  సమావేశానికి ఆయన అధ్యక్షత వహించారు. ఈ సమావేశంలో పలు రాష్ట్రాల ముఖ్యమంత్రులు, కేంద్రమంత్రులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ప్రధాని మహిళల రక్షణ అంశాన్ని లేవనెత్తారు. మహిళల

భద్రతకు ప్రథమ ప్రాధాన్యమివ్వాలని ఆయన రాష్ట్రాల ముఖ్యమంత్రులకు సూచించారు. జనాభాలో సగభాగమైన మహిళల క్రియాశీల భాస్వామ్యం లేనిదే ఏ అభివృద్ధి సంపూర్ణం కాదని, వారికి రక్షణ కల్పించకపోతే ఈ కీలక భాగస్వామ్యం సాధ్యం కాదని ఆయన వివరించారు. ఢిల్లీ సంఘటనను ఆయన ఉదహరిస్తూ నేరస్తులను పట్టుకున్నామన్నారు. లైంగిక నేరాలపై ఉన్న చట్టాలకు మరింత పదును పెట్టేందుకు ప్రభుత్వం నిర్ణయించిందని తెలిపారు. లైంగిక వేదింపుల చట్టాలను సమీక్షిస్తామని చెప్పారు. ఈ కేసుల్లో శిక్షలు కఠిన తరం చేసేందుకు గల అవకాశాలను పరిశీలిస్తామని, ప్రస్తుతం ఉన్న చట్టాలను సమీక్షిస్తామని చెప్పారు. ప్రస్తుత ఆర్థిక పరిస్థితి కష్టతరంగా ఉందని అన్నారు. పరిస్థితిని గాడిన పెట్టేందుకు ఇంధన ధరల పెంపు, సబ్సిడీల కోత వంటి కఠిన చర్యలు తీసుకోకతప్పదని సూచనప్రాయంగా చెప్పారు. 12వ పంచవర్ష ప్రణాళికలో నిర్దేశించుకున్న ఎనిమిది శాతం అభివృద్ధి లక్ష్యాన్ని సాధించేందుకు ఈ చర్యలు తప్పవన్నారు. అభివృద్ధి లక్షాన్ని సాధించేందుకు ప్రస్తుతం అమలు చేస్తున్న విధానాలు సరిపోవన్నారు. 12వ పంచవర్ష ప్రణాళిక(2012-17) ప్రణాళిక ప్రతిపాదనలకు ఆమోదించేందుకు వివిధ రాష్ట్రాల ముఖ్యమంత్రులు, కేంద్రమంత్రులతో జాతీయ మండలి సమావేశమైంది. ఈ ప్రణాళికలో సరాసరి వార్షిక వృద్ధి రేటును తగ్గించేందుకు ప్రణాళికా సంఘం రెండోసారి ప్రతిపాదించింది. అభివృద్ధి లక్ష్యం చేరుకునేందుకు సబ్సిడీల కోత తప్పదని, ఈ విషయంపై ప్రజల్లో అవగాహన కల్పించాలన్నారు. ఇందుకు రాష్ట్ర ప్రభుత్వాలు చర్యలు చేపట్టాలన్నారు. దేశాభివృద్ధికి కేంద్ర, రాష్ట్రాల మధ్య సహకారం అవసరమని అన్నారు. కొన్ని వర్గాలకు విద్యుత్‌ ఛార్జీలు పెంచాల్సిన అవసరం ఉందన్నారు. వృధాను అరికట్టేందుకే నగదు బదిలీ పథకం తీసుకొస్తున్నామన్నారు. ప్రస్తుతం ఆర్థికపరిస్థితి నుంచి గట్టేక్కించేందుకు కఠిన చర్యలు అవసరమన్నారు. ప్రపంచ వ్యాప్తంగా ఉన్న ఆర్థిక సంక్షోభం దేశంపై పడకుండా కాపాడతామన్నారు. అంతకు ముందు ప్లానింగ్‌ కమిషన్‌ డిప్యూటి చైర్మన్‌ మాంటెక్‌ సింగ్‌ అహ్లూవాలియా మాట్లాడుతూ దేశ అంతర్జాతీయ ఆర్థికపద నేపథ్యంలో అభివృద్ధి శాతం 8శాతానికి కుదిస్తున్నట్టు పేర్కొన్నారు. అభివృద్ధి సాధించే క్రమంలో వనరులను పెంపొందించుకునేందకు కేంద్ర రాష్ట్రాలు సహకారం అవసరమన్నారు. ఈ సమావేశంలో వివిధ రాష్ట్రాల ముఖ్యమంత్రులతో పాటు కేంద్రమంత్రులు చిదంబరం, ఆంటోని, శరద్‌పవార్‌, తదితరులు పాల్గొన్నారు.  కాగా ఎన్‌డిసి సమావేశంలో తమ అభిప్రాయాలను చెప్పేందుకు తగిన సమయం కేటాయించలేదని కేంద్రంపై తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత ఆగ్రహం వ్యక్తం చేశారు. కేవలం 10నిముషాల మాత్రమే సమయం కేటాయించడాన్ని తప్పు పడుతూ నిరసన వ్యక్తం చేస్తూ సమావేశం నుంచి వాకౌట్‌ చేశారు.