మహిళల సింగిల్స్‌

టైటిల్‌ బర్తోలి కైవసం

లండన్‌ జూలై 6  (జనంసాక్షి):

వింబుల్డన్‌ టెన్నిస్‌ టోర్నీలో మహిళల సింగిల్స్‌ టైటిల్‌ను మారియన్‌ బర్తోలి కైవసం చేసుకుంది. ఫైనల్‌లో జర్మనీకి చెందిన సబైన్‌ లిసికిపై 6-1, 6-4 తేడాతో బర్తోలి విజయం సాధించింది. ఫ్రాన్స్‌కు చెందిన బర్తోలీకి కెరీర్‌లో ఇదే తొలి గ్రాండ్‌స్లామ్‌ టైటిల్‌. ఆరేళ్ల క్రితం వింబుల్డన్‌ ఫైనల్స్‌లో సెరీనా విలియమ్స్‌ చేతిలో ఓడిపోయిన బర్తోలి కసితో ఈ సారి టైటిల్‌ గెలుచుకుంది. 23 వ సీడ్‌ లిసికిని ఓడించడానికి బర్తొలికి కేవలం 81 నిమిషాలు మాత్రమే పట్టింది. అమె లీ మైరెస్కో(2006) తర్వాత వింబుల్డన్‌ గెలుచుకున్న ఫ్రెంచ్‌ క్రీడాకారిణిగా బర్తోలి రికార్డు సృష్టించింది. 15వ ర్యాంకింగ్‌లో కొనసాగుతున్న బర్తోలి తాజా విజయంతో సోమవారం ప్రకటించే ర్యాంకింగ్స్‌లో ఏడో ర్యాంక్‌కు ఎగబాకే అవకాశం ఉంది. 2004 వింబుల్డన్‌లో క్వార్టర్‌ ఫైనల్స్‌లో వెనుదిరిగిన బర్తోలి 2007లో ఫైనల్స్‌కుచేరింది. తాజాగా ఇప్పుడు వింబుల్డన్‌ గెలిచి చిరకాల స్వప్నాన్ని నెరవేర్చుకుంది.