మాకు ఎవరి పొత్తు అవసరం లేదు

బెంగళూరు: కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో భాజపా ఆధిక్యంలో కొనసాగుతోంది. మ్యాజిక్‌ మార్క్‌ 113కి చేరువగా భాజపా ఆధిక్యంలో ఉండడంతో రాష్ట్రంలో ప్రభుత్వ ఏర్పాటుపై కమలనాథులు నమ్మకంగా ఉన్నారు. తొలి రౌండ్లలో పోటా పోటీగా ఉన్న కాంగ్రెస్‌ ఆ తర్వాత వెనుకబడిపోయింది. జేడీఎస్‌ మూడో స్థానంలో ఉంది. అయితే జేడీఎస్‌తో పొత్తు విషయంపై భాజపా నేత సదానంద గౌడను విలేకరులు ప్రశ్నించగా.. అసలు పొత్తు ప్రశ్నే లేదని స్పష్టం చేశారు. భాజపా 110 స్థానాలకు పైగా సాధించే అవకాశం స్పష్టంగా ఉన్నందున పొత్తుతో పనిలేదని, తాము సొంతగా ప్రభుత్వం ఏర్పాటు చేస్తామని గౌడ వెల్లడించారు.

మరో వైపు కేంద్ర మానవ వనరుల శాఖ మంత్రి ప్రకాశ్‌ జవదేకర్‌ బెంగుళూరుకు బయల్దేరి వెళ్లారు. ఆయన కర్ణాటకకు భాజపా ఇన్‌ఛార్జిగా ఉన్నారు. భాజపా ఆధిక్యంలో కొనసాగుతున్న నేపథ్యంలో తదుపరి పరిణామాలను దగ్గరుండి పరిశీలించడం కోసం ఆయన కర్ణాటకకు వెళ్తున్నారు. అంతకంటే ముందు భాజపా జాతీయాధ్యక్షుడు అమిత్‌ షాను ఆయన నివాసంలో కలిసి చర్చించారు.