మాజీ నేవీ ఛీఫ్‌ అడ్మిరల్‌ సుశీల్‌కుమార్‌ మృతి

న్యూఢిల్లీ, నవంబర్‌27(జనం సాక్షి) : భారత నావికాదళ మాజీ అధిపతి అడ్మిరల్‌ సుశీల్‌ కుమార్‌(79) బుధవారం ఉదయం ఢిల్లీలోని ఆర్మీ రిసెర్చ్‌ అండ్‌ రిఫరల్‌ ఆసుపత్రిలో తుది శ్వాస విడిచారు. కొద్ది కాలంగా ఆయన అస్వస్థతతో బాధపడుతున్నారు. ఇటీవలే ఆయన్ను ఈ ఆసుపత్రిలో చికిత్స నిమిత్తం చేర్చారు. ఆయన 1998 నుంచి 2000 వరకు భారత నావికాదళం ప్రధానాధికారిగా పనిచేశారు. తమిళనాడులోని నాగర్‌కోయిల్‌లో జన్మించిన సుశీల్‌ కుమార్‌ 1965, 1971లలో జరిగిన భారత-పాక్‌ యుద్దాల్లో నావికాదళంలో ఆయన సేవలు అందించారు. దేశానికి ఆయన అందించిన సేవలకుగానూ పరమ విశిష్ట సేవా పురస్కారం, ఉత్తమ యోధ సేవా పురస్కారం, అతి విశిష్ట సేవా పురస్కారం వంటి అనేక గౌరవాలను అందుకున్నారు.