మాజీ ప్రధాని దేవేగౌడకు మోడీ ఫోన్‌

జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన ప్రధాని
న్యూఢిల్లీ,మే18(జ‌నం సాక్షి ): మాజీ ప్రధాని, జేడీఎస్‌ నేత హెచ్‌డీ దేవె గౌడకు ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ శుభాకాంక్షలు తెలియజేశారు. దేవెగౌడ పుట్టిన రోజు సందర్భంగా మోదీ ఆయనకు ఫోన్‌ చేసి జన్మదిన శుభాకాంక్షలు చెప్పారు. ‘మన మాజీ ప్రధాన మంత్రి శ్రీ దేవెగౌడ జీ తో మాట్లాడాను. ఆయనకు పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలియజేశాను. ఆయన ఆరోగ్యం, జీవితం బాగుండాలని దేవుడిని ప్రార్థిస్తున్నాను’ అని మోదీ ట్విటర్‌ ద్వారా తెలిపారు. కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో రాష్ట్రంలో భాజపాకు, కాంగ్రెస్‌-జేడీఎస్‌లకు మధ్య అధికారం కోసం పోరాటం జరుగుతున్నసంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో దేవెగౌడకు ప్రధాని ఫోన్‌ చేసి మాట్లాడటం చర్చనీయాంశంగా మారింది. దేవేగౌడ ఆయురారోగ్యాలతో మరెన్నో పుట్టిన రోజులు జరుపుకోవాలని ప్రార్థిస్తున్నట్లు మోదీ పేర్కొన్నారు. ఇటీవల జరిగిన ఎన్నికల ప్రచారంలో రాహుల్‌ గాంధీ.. మాజీ ప్రధాని దేవేగౌడను అవమానించారని వ్యాఖ్యలు చేసిన మోదీ.. ఆ తర్వాత జరిగిన మరో సభలో దేవేగౌడపై విమర్శలు గుప్పించిన సంగతి తెలిసిందే. దేవెగౌడ 1996 జూన్‌ 1 నుంచి 1997 ఏప్రిల్‌ 21 వరకు ప్రధాన మంత్రిగా పనిచేశారు. నేడు 85వ ఏట అడుగుపెట్టారు. పుట్టిన రోజు, కర్ణాటకలో రాజకీయ పరిణామాల నేపథ్యంలో దేవెగౌడ తిరుమలకు వెళ్లి శ్రీవెంకటేశ్వర స్వామి దర్శనం చేసుకున్నారు. కుటుంబంలో చీలిక వస్తున్నట్లు జరిగిన ప్రచారం నేపథ్యంలో కుమారుడు రేవణ్ణను వెంటపెట్టుకుని ఇక్కడికి వచ్చారు. కర్ణాటకలో గవర్నర్‌ భాజపాను ప్రభుత్వం ఏర్పాటు చేయాలని ఆహ్వానించడంతో యడ్యూరప్ప ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన సంగతి తెలిసిందే. దీన్ని వ్యతిరేకిస్తూ కాంగ్రెస్‌, జేడీఎస్‌లు సుప్రీంను ఆశ్రయించాయి. భాజపా బలనిరూపణ చేసుకోవాల్సి ఉండగా తమ ఎమ్మెల్యేలను కాపాడుకునేందుకు కాంగ్రెస్‌, జేడీఎస్‌ తీవ్రంగా శ్రమిస్తున్నాయి. ఎమ్మెల్యేలను బస్సుల్లో హైదరాబాద్‌లోని ఓ ¬టల్‌కు తరలించారు.