* మాదాపూర్ అయ్యప్ప సొసైటీ లో యదేచ్చగా అక్రమ భవనాలు, షెడ్ల నిర్మాణం!

చోద్యం చూస్తున్న జిహెచ్ఎంసి అధికారులు…
క్రింది స్థాయి సిబ్బంది సహకారంతోనే ఆక్రమణలకు శ్రీకారం?
 అధికారులకు కాసులు కురిపిస్తున్న అయ్యప్ప సొసైటీ?
 వివాదాస్పద స్థలాలనుసైతం వదలరా అని అసహనం వ్యక్తంచేస్తున్న శేరిలింగంపల్లి వాసులు*
శేరిలింగంపల్లి, జూన్ 22(జనంసాక్షి ): శేరిలింగంపల్లి నియోజకవర్గం మాదాపూర్ డివిజన్ పరిధి అయ్యప్ప సొసైటీ లో అక్రమనిర్మాణాలు యథేచ్ఛగా కోన సాగుతున్నాయి. ఎంతలాఅంటే అవి పూర్తిగా వివాదాస్పద స్థలాలని కోర్టులుసైతం ధ్రువీకరించినప్పటికీ వేల గజాలలో బహుళ అంతస్తులు షెడ్డులరూపంలో అక్రమనిర్మాణాలు వెలుస్తుండటం తీవ్రవిమర్శలకు దారితీస్తోంది. శేరిలింగంపల్లి నియోజకవర్గం పరిధి మాదాపూర్, ఖానంమెట్, గోకుల్ ఫ్లాట్స్ ప్రాంతాలభూములకు మార్కెట్ పరంగా లక్షకు పైగా ధర పలుకుతోంది. దీంతో కబ్జారాయుళ్లకళ్ళు సహజంగానే ఈభూములపై పడుతుంటాయనడంలో సందేహం లేదు. గతంలో పలు సందర్భాల్లో ఇక్కడిస్థలాల్లో అక్రమ నిర్మాణాలను చేపట్టినప్పుడు స్థానికంగా కొందరు అభ్యంతరాలను వ్యక్తం చేయడంతోపాటు కోర్టు మెట్లను సైతం ఆశ్రయించడం గమనార్హం. ఈనేపథ్యంలో సదరువివాదాస్పద భూములలో ఎలాంటి నిర్మాణాలను చేపట్టకూడదని స్పష్టమైనఆదేశాలు అమలులో ఉన్నాయి. అయినప్పటికీ ఓవైపు జిహెచ్ఎంసి, మరోవైపు మండల రెవెన్యూ అధికారుల అండదండల ను ప్రసన్నం చేసుకుంటున్న దళారులు, కబ్జారాయుళ్ల తోపాటు పలు రాజకీయపార్టీల నాయకులు, ప్రజాప్రతినిధులు ఎవరి సత్తామేరకు వారు తెగబడుతూ కబ్జాలకు పాల్పడుతున్నారని, అందువల్లనే వివాదాస్పదభూములు కాస్తా హారతికర్పూరంలా కరిగిపోతున్నాయని ప్రజా సంఘాలు, పలు స్వచ్ఛందసంస్థల ప్రతినిధులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
     ” మాదాపూర్ అయ్యప్ప సొసైటీ అక్రమ భవనాలు, షెడ్లు నిర్మాణంవెనుక జిహెచ్ఎంసి క్రింది స్థాయి సిబ్బంది”…?
 గురుకుల్ ట్రస్ట్ అయ్యప్ప సొసైటీ భూములపై ఏళ్లుగా కోర్టులలో కేసులు నానుతున్నప్పటికీ మరోవైపు కబ్జాల పరంపర నిరాటంకంగా కొనసాగుతున్న ఉదంతం వెనుక జిహెచ్ఎంసి క్రింది స్థాయిసిబ్బంది పావులుకదుపుతూ చేతివాటం ప్రదర్శిస్తున్నారని పెద్దఎత్తున విమర్శలు చెలరేగుతున్నాయి. ఎంతో విలువైన అయ్యప్ప సొసైటీ ఏరియాలో బాహాటంగా భూములకబ్జాలకు పూను కోవాలంటే అంత ఆషామాషీ వ్యవహారం కాదని, గట్టి పలుకుబడి కలిగిన బడాబాబులైనా అయ్యుండాలి లేదా రాజకీయ నేతలతో కుమ్మక్కయిన అయ్యుండాలని స్థానికులు అభిప్రాయపడుతున్నారు. అయితే ఇక్కడ విచిత్రం ఏమిటంటే చందానగర్ జిహెచ్ఎంసి క్రిందిస్థాయి సిబ్బంది అన్నీతామై ఉన్నతాధికారుల సహకారంతో అక్రమ నిర్మాణాలకు ఆజ్యం పోస్తున్నారనే ఊహాగానాలు వూపందుకోవడం విశేషం! ఉదాహరణకు అయ్యప్ప సొసైటీ లో ప్లాట్ నెంబర్ 845, 100 ఫీట్ రోడ్ ప్రక్కన, తాండా రోడ్డులో అక్రమ షెడ్లు  ఏకంగా సుమారు 500 నుండి 1500 వందల గజాలలో పట్టపగలే యదేచ్ఛగా అక్రమ భవనాలు, షెడ్లు నిర్మాణం జరుగుతోందంటే ఇది సామాన్యులకు సాధ్యమయ్యే పనేనా, దీనివెనుక ప్రభుత్వపెద్దలు, జిహెచ్ఎంసి అధికారయంత్రాంగం పాత్రపైనా వివిధ పార్టీలప్రతినిధులు అనుమానం వ్యక్తంచేస్తున్నారు.
 ” భూముల కబ్జాతో సర్కారుకు కోట్లరూపాయల నష్టం – ఖజానాకు గండి…!? “
 గ్రేటర్ హైదరాబాదుతోపాటు యావత్ తెలంగాణరాష్ట్రంలోనే ఎంతోవిలువైన భూములుగా పేరుగాంచిన శేరిలింగంపల్లి మాదాపూర్ డివిజన్ పరిధిలోని ప్రభుత్వభూములు భూ కబ్జాదారులచేతిలో అప్పనంగా కరిగిపోతుంటే కాసులకు కక్కుర్తి పడుతున్న క్రిందిస్థాయి అధికారుల పుణ్యమాని వందలకోట్ల విలువ చేసే భూములకు రెక్కలువచ్చి కళ్లముందే కనుమరుగైపోతున్నాయని, తద్వారా కోట్లాదిరూపాయల ప్రభుత్వ ఖజానాకు గండి పడుతోందని సామాజికవేత్తలు, మేధావులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. చీమలదండును తలపిస్తున్న జిహెచ్ఎంసి క్రింది స్థాయిసిబ్బంది లంచాలను దండుకునేక్రమంలో ఇటు కబ్జారాయుళ్లకు, అటు రాజకీయ నాయకులకు వారధిగామారుతూ ప్రభుత్వఖజానాకు తీరనినష్టాన్ని మిగిల్చు తున్నారని మాదాపూర్ అయ్యప్ప సొసైటీ అంటేనే అధికారులకు కాసుల వర్షం కురుస్తుంది అని శేరిలింగంపల్లి వాసులు వాపోతున్నారు. ఇప్పటికైనా ప్రభుత్వపెద్దలు, ఉన్నతాధికారులు అయ్యప్ప సొసైటీ వివాదాస్పద భూములవిషయంలో ఉన్నతస్థాయి కమిటీనివేసి నిజాలను నిగ్గు తేలిస్తే భవిష్యత్తులోనైనా భూఆక్రమణల ఆగడాలకు అడ్డుకట్ట పడుతుందని ఆశాభావం వ్యక్తంచేస్తున్నారు.