” మాదాపూర్ లో అక్రమ హుక్కా సెంటర్ పై దాడి… పలువురి అరెస్ట్”
శేరిలింగంపల్లి, అక్టోబర్ 11( జనంసాక్షి): నిబంధనలకు విరుద్ధంగా అక్రమంగా మాదాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో నిర్వహిస్తున్న ఓ హుక్కా సెంటర్ పై సైబరాబాద్ పోలీసులు దాడికి పాల్పడి పలువురిని అదుపులోకి తీసుకున్న ఘటన సంచలనంగా మారింది. ఈమేరకు పోలీస్ అధికారి వెల్లడించిన వివరాల ప్రకారం… పోలీస్ స్టేషన్ పరిధి కింగ్స్ డ్రైవ్ ఇన్ రెస్టారెంట్ పక్కన గల ది బ్యాక్ యార్డ్ కేఫ్ లోపల ఎలాంటి అనుమతులు లేకుండా, అక్రమంగా గుట్టుచప్పుడు కాకుండా హుక్కా సెంటర్ ను నిర్వహిస్తున్నారని విశ్వసనీయ సమాచారం అందుకున్న ఎస్ఓటి పోలీసులు సోమవారం రాత్రి సదరు కేఫ్ ఫై దాడికి పాల్పడగా అందులో కొంతమంది యువకులు హుక్కాను సేవిస్తూ ప్రత్యక్షంగా పట్టుబడ్డారు. హుక్కా సెంటర్ నిర్వహణపై కేఫ్ యాజమాన్యానికి వివరణ కోరగా సమాధానాలు చెప్పడంతో ఎలాంటి అనుమతులు లేకుండానే అశాస్త్రీయంగా సెంటర్ ను నడుపుతున్నట్టు గ్రహించి కేఫ్ యజమాని కె. సాయికిరణ్ గౌడ్, మేనేజర్ ఫణి కుమార్, హుక్కాను సర్వీస్ చేస్తున్న వంశీ గౌడ్, మహమ్మద్ సర్ఫరాజ్, అక్బర్ తదితరులను అదుపులోకి తీసుకోవడంతో పాటు హుక్కా పాట్స్ 7, హుక్కా పైపులు 10, హుక్కా ఫ్లేవర్లు-3, హుక్కా హెడ్స్ 10 స్వాధీనం చేసుకున్నారు. మీడియా ముందు ప్రవేశపెట్టిన అనంతరం అరెస్ట్ అయిన నిందితులను మంగళవారం రిమాండ్ కు తరలించి కేసును దర్యాప్తు చేస్తున్నారు.