మాధవరెడ్డి కారుకు మల్లారెడ్డి స్టిక్కర్‌

దాంతో సంబంధం లేదన్న మంత్రి మల్లారెడ్డి
ఎప్పుడో వాడి పడేశానని చెప్పిన మంత్రి

హైదరాబాద్‌,జూలై28(జనంసాక్షి ): క్యాసినో వ్యవహారంలో ఈడీ నిర్వహించిన సోదాల్లో మాధవరెడ్డి కారుకు మంత్రి స్టిక్కర్‌ కనిపించింది. గురువారం తెల్లవారు జాము వరకు ఇడి దాడులు కొనసాగాయి. ఈ క్రమంలో స్టిక్కర్‌ లభించడంపై మంత్రి మల్లారెడ్డి స్పందించారు. మాధవరెడ్డితో తనకు ఎలాంటి సంబంధం లేదని చెప్పారు. బోడుప్పల్‌ ప్రభుత్వ జిల్లా పరిషత్‌ పాఠశాల విద్యార్థులకు పుస్తకాలు అందజేసిన అనంతరం ఆయన విూడియాతో మాట్లాడారు. మాధవ రెడ్డి కారుకు ఉన్న స్టిక్కర్‌ తనదేనన్న మల్లారెడ్డి.. అది 2022 మార్చి నాటిదని చెప్పారు. మూడు నెలల క్రితమే దాన్ని తీసి బయటపడేశామని, దాన్ని ఎవరో పెట్టుకుంటే తనకేం సంబంధమని అన్నారు. ఇదిలా ఉంటే క్యాసినో కేసులో దర్యాప్తులో భాగంగా చికోటి ప్రవీణ్‌, మాధవరెడ్డి నివాసాల్లో ఈడీ సోదాలు చేసింది. దర్యాప్తులో రెండు తెలుగు రాష్టాల్రకు చెందిన పలువురు ప్రముఖులు వారిద్దరితో టచ్‌ లో ఉన్నట్లు అధికారులు గుర్తించారు. తనిఖీల్లో భాగంగా ఈడీ అధికారులు మాధవరెడ్డి వాడుతున్న కారుకు ఎమ్మెల్యే స్టిక్కర్‌ ఉన్నట్లు గుర్తించారు. అది మంత్రి మల్లారెడ్డికి సంబంధించినదిగా గుర్తించారు. దీంతో మాధవరెడ్డికి మంత్రి మల్లారెడ్డితో సంబంధం ఉండొచ్చన్న అనుమానాలు వ్యక్తమయ్యాయి. ఈ నేపథ్యంలో తాజాగా మంత్రి ఈ అంశంపై క్లారిటీ ఇచ్చారు.