మానవత్వం మంటగలుస్తున్న వేళ… చందానగర్ లో ఒకే కుటుంబంలో మూడు హత్యలు ఒక ఆత్మహత్య!”

శేరిలింగంప‌ల్లి, అక్టోబర్ 17( జనంసాక్షి): పెరుగుతున్న సాంకేతిక పరిజ్ఞానం…ఆధునిక జీవన విధానం…అంతరిస్తున్న నైతిక విలువలు… అడుగంటిపోయిన మానవత్వం, ఉమ్మడి కుటుంబవ్యవస్థ… బాధలను ఓర్వలేని మనస్తత్వాలు… బాధ్యతలేని మనుషులు… వెరసి నేడు మనిషి జీవితం మంటగలిసిపోతోంది… అనుమానం పెనుభూతమై క్షణికావేశంలో నిండు జీవితాలు బుగ్గిపాలవుతున్నాయి… సాటి మనిషిని మనిషిగా చూడలేని… భరించలేని విపరీత ధోరణిని నెత్తికెక్కించుకుంటున్న సగటు మనిషి తనకు తానే శత్రువై… సభ్య సమాజంనుండి వెలేసుకుంటూ తనతోపాటు నిండునూరేళ్ల జీవితాన్ని పంచియిచ్చిన అర్ధాంగిని, కడుపున పుట్టిన పాపానికి కన్న పిల్లలను దారుణంగా కడతేరుస్తున్నారు… ఓవైపు విశ్వాంతరాళాన్ని పట్టి వడబోస్తున్నా… మరోవైపు కుటిల స్వభావంతో క్రూరంగా మారి “కొత్త ఎప్పుడు ఒక రోతేనని… ఆ పాత మధురమే ఎప్పుడూ మేలని ” చెప్పకనే చెబుతున్న తరుణమిది. సభ్య సమాజం… మనిషి ఆలోచన ధోరణికి… సంస్కృతి సాంప్రదాయాల విధ్వంస ఫలితానికి… పెను సవాలు విసరుతున్న శేరిలింగంపల్లి నియోజకవర్గం చందానగర్ ఘటన… భార్యాభర్తల అనుబంధాన్ని… తల్లిదండ్రులు పిల్లల మధ్య ఆప్యాయతని… పెళ్లి చేసి ఓ ఇంటికి పంపి కోటి ఆశలతో కలలుగంటున్న ఆడపిల్ల తల్లిదండ్రులకి… మానవత్వం కోసం పరితపించే మానవతావాదుల మస్తిష్కాలకు పరిష్కారం దొరకని సమస్యగా… జవాబే దొరకనే మిలియన్ డాలర్ల ప్రశ్నగా మిగిలిపోయి అందరినీ ఆత్మరక్షణలోకి నెట్టే సందర్భం! చందానగర్ పోలీసులు, ప్రత్యక్ష సాక్షుల కథనం ప్రకారం సంగారెడ్డి మండలం కోహిర్ ప్రాంతానికి చెందిన మడపటి నాగరాజు(38) వివాహం సుజాత(33) జరిగింది. వీరికి సిద్దు (11), రమ్య (7) ఇద్దరు పిల్లలు. అయితే బ్రతుకుతెరువు నిమిత్తం గత ఏడేళ్ల క్రితం సంగారెడ్డి నుండి శేరిలింగంపల్లి వచ్చి చందానగర్ సర్కిల్ పరిధి పాపి రెడ్డి కాలనీ రాజీవ్ గృహకల్ప బ్లాక్ నెంబర్ 18 లో నివాసం ఉంటున్నారు. నాగరాజు ఓ ప్రైవేటు కంపెనీలో సరుకుల రవాణాను కొనసాగిస్తుండగా సుజాత ఇంటి వద్దనే మిషన్ కుట్టుకుంటూ భర్తకు చెదోడు వాదోడుగా ఉంటుంది. సాఫీగా సాగుతున్న సంసారంలో నాగరాజు ఆలోచన నుంచి పుట్టుకొచ్చిన అనుమానపు భూతం నిప్పులు పోస్తోంది. దీంతో అన్యోన్య దాంపత్యం కాస్తా అనవసరపు గొడవలు, వివాదాలకు దారితీస్తూ ఇళ్లే నరకప్రాయంగా మారింది. ఈ నేపథ్యంలో నాగరాజు భార్యపై మరింత అనుమానాన్ని పెంచుకొని కంపెనీకి వెళ్లకుండా ఇంటి వద్ద ఉంటూ సుజాత పై వేధింపులకు పాల్పడుతున్నాడు. ఈ క్రమంలో గత మూడు రోజుల క్రితం ఇరువురి మధ్య మాటా మాటా పెరిగి గొడవకి దారితీసింది. దీంతో భార్యపై కక్ష పెంచుకున్న నాగరాజు అన్నంలో విషం కలిపి భార్యతో సహా పిల్లలకు పెట్టాడు. అపస్మారస్థితికి చేరుకున్న ముగ్గురిపై కనీస కనికరం లేకుండా బట్టలు కత్తిరించే కత్తెరతో విచక్షణారహితంగా పొడిచి హత్య చేశాడు. తర్వాత తాను సైతం అదే ఇంట్లో ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. కారణాలేవైనప్పటికీ చిన్నపాటి అనుమానమే పండంటి కాపురం పేక మేడలా కూల్చేసిందని…హత్యలు, ఆత్మహత్య వల్ల అనుమానం పటా పంచలై జీవితాలు తిరిగి వస్తాయా అని ఇరుగు-పొరుగు వారుు వాపోతున్నారు. ప్రస్తుత పరిస్థితులలో నాగరాజు కుటుంబం మూకుమ్మడి బలవన్మరణానికి పాల్పడినా… ఆలోచిస్తే ఆధునికపు ముసుగులో పెట్రేగిపోతున్న అహంకారం… ఆధిపత్యం… ఒంటరితనం… బాధ్యతారాహిత్యం… అడుగంటిపోయిన మానవత్వం కలగలసి పతనమంచున మనిషిని నిలబెట్టి నేరస్తుడిగా రుజువు చేస్తున్నాయనడంలో సందేహం లేదు. ఈమేరకు చందానగర్ పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.