మామను ఓడించేందుకు హరీష్‌ సాయం అడిగాడు

కెసిఆర్‌ ఓటమే హరీష్‌ లక్ష్యంగా ఉంది

గజ్వెల్‌లో కాంగ్రెస్‌ నేత వంటేరు ప్రతాపరెడ్డి సంచలన వ్యాఖ్యలు

సిద్దిపేట,నవంబర్‌3(జ‌నంసాక్షి): మంత్రి హరీశ్‌రావుపై గజ్వెల్‌ కాంగ్రెస్‌ నేత ఒంటేరు ప్రతాప్‌రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఎలాగైనా తన మామ, సీఎం కేసీఆర్‌ను గజ్వేల్‌లో ఓడించాలని హరీశ్‌ తనను కోరినట్లు ఆయన వెల్లడించి కలకలం రేపారు. ఇది నూటకి నూరు పాళ్కలు నిజం..తన రాజకీయ భవిస్యత్‌కు కెటిఆర్‌ గండి కొడుతున్నాడని కోపంతో ఈ సాయం చేసిపెట్టమిన కోరాడని వ్యాఖ్యానించారు. ఓ ప్రైవేట్‌ నెంబర్‌ నుంచి హరీశ్‌రావు నిన్న తనకు ఫోన్‌ చేశారని.. త్వరలో జరగబోయే ఎన్నికల్లో కేసీఆర్‌ను ఓడించాలని, అవసరమైన ఆర్థిక సాయం అందిస్తానని ఆయన తనతో అన్నట్టు ప్రతాప్‌రెడ్డి వ్యాఖ్యానించారు. అన్ని బాధ్యతలను కేటీఆర్‌కే అప్పగిస్తూ కేసీఆర్‌ తన ఇజ్జత్‌ తీస్తున్నారని, ఆయన వైఖరితో రాజకీయ జీవితం లేకుండా పోతోందని హరీశ్‌ చెప్పినట్లు ప్రతాప్‌ రెడ్డి తెలిపారు. కేసీఆర్‌ను ఓడించేందుకు కలిసి పనిచేద్దామన్నారని హరీష్‌ అన్నారని వివరించారు. అందుకోసం ఆర్థికసాయం అందిస్తానని కూడా హరీశ్‌ చెప్పారని వెల్లడించారు. అయితే అవినీతి సొమ్ము తనకు వద్దని తిరస్కరించానన్నారు. తనకు గజ్వేల్‌ ప్రజలు, యువత అండగా ఉన్నారని, కేసీఆర్‌ కుటుంబం మొత్తం వచ్చి ప్రచారం చేసినా విజయం తనదేనని ప్రతాప్‌రెడ్డి ధీమా వ్యక్తం చేశారు. గజ్వేల్‌లో నిర్వహించిన ఓ సమావేశంలో ప్రతాప్‌ రెడ్డి మాట్లాడారు. ఈ వ్యాఖ్యలపై ఏ దేవుడిపైనైనా ప్రమాణం చేసేందుకు తాను సిద్ధంగా ఉన్నానని అన్నారు. రానున్న ఎన్నికల్లో గజ్వెల్‌ నుంచి ప్రతాప్‌ రెడ్డి పోటీ దాదాపు ఖాయమైంది. ఆయన గతంలో టిడిపి నుంచి ఇప్పుడు కాంగ్రెస్‌లో చేరారు.