మారుతున్న కాంగ్రెస్‌ సవిూకరణాలు

పాతకాపులకు మళ్లీ రాహుల్‌ ఎర

డిఎస్‌ను రప్పించి పిసిసి అప్పగించే యత్నాలు?

ఢిల్లీ స్థాయి మంతనాలతో మార్గం సుగమం

డిఎస్‌ టిఆర్‌ఎస్‌ను వీడడం ఖాయం

డిఎస్‌పై బహిష్కరణ వేటు వేసే అవకాశాలు?

న్యూఢిల్లీ,జూన్‌28(జ‌నం సాక్షి): నిప్పులేనిదే పొగరాదన్నది సామెత. రాజకీయాల్లో తాజా పరిస్థితులను చూస్తుంటే కాంగ్రెస్‌ పొగరాజేస్తోందనే అర్థం అవుతోంది. యాదృచ్ఛికమే అయినా బుధవారం రాజకీయంగా ఎపి, తెలంగాణలో రెండు కీలక పరిణామాలు చోటు చేసుకున్నాయి. మాజీ సిఎం కిరణ్‌ కుమార్‌ రెడ్డిని కాంగ్రెస్‌లోకి ఆహ్వానిస్తే, డిఎస్‌పై క్రమ శిక్షణ చర్యలు తీసుకోవాలంటూ తెలంగాణలో ఎంపి కవిత విూడియా సమావేశంలో గట్టిగా కోరారు. ఈ రెండూ కూడా కాంగ్రెస్‌ చాపకింది నీరు వ్యవహారాలే. ఈ వ్యవహారాల తీరు చూస్తుంటే డిఎస్‌తో ఇక కెసిఆర్‌ చర్చలు జరిపే అవకాశాలు లేకపోగా ఆయనను పార్టీ నుంచి సస్పెండ్‌ చేసే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. దీనికి ముందే డిఎస్‌ కూడా హుందాగా పార్టీకి రాజీనామా చేసే అవకాశాలు ఉన్నాయి. ఇకపోతే కాంగ్రెస్‌ మళ్లీ వేగంగా పావులు కదుపుతోంది. ఇటీవల పిసిసి అధ్యక్షుడు ఉత్తమ్‌కు వ్యతిరేకంగా ఢిల్లీ స్థాయిలో పితూరీలు చేరాయి. ఉత్తమ్‌ను మారుస్తున్నారంటూ వార్తలు వచ్చాయి. దానం నాగేందర్‌ టిఆర్‌ఎస్‌లోకి పోతూపోతూ కాంగ్రెస్‌లో బలహీనవర్గాలకు ప్రాధాన్యం లేకుండా పోయిందన్న కామెంట్‌ చేశారు. ఈ దశలో డిఎస్‌ వ్యవహారం కూడా అనుమానాలకు తావిస్తోంది. డిఎస్‌ను మళ్లీ కాంగ్రెస్‌లోకి రప్పించి పిసిసి చీఫ్‌ను చేస్తారన్న వార్తలు కూడా వస్తున్నాయి. ఆయన తలపండినరాజకీయవేత్తే గాకుండా గతంలో పిసిసి అధ్యక్షుడిగా అనుభవం ఉన్న నేత. దీనికితోడు ఆయన అధికార టిఆర్‌ఎస్‌లో ఇమడలేకపోతున్నారన్న భావన కూడా ఉంది. దీనికితోడు టిఆర్‌ఎస్‌ అనుసరిస్తున్న పెత్తందారీ రాజకీయాలు రాజ్యసభ సభ్యుడు డి.శ్రీనివాస్‌ టీఆర్‌ఎస్‌ను వీడటానికి పునాదిగా మారుతున్నాయి. నిజామా బాద్‌ ఎంపీ కవితకు వ్యతిరేకంగా డీఎస్‌ కుమారుడు అరవింద్‌ ప్రచారానికి పూనుకోవడం ఆమెకు ఆగ్రహం కలిగించింది. ఇప్పుడు అదే డీఎస్‌ టీఆర్‌ఎస్‌ను వీడటానికి కారణమైందని ఆయన సన్నిహితు లంటున్నారు. తనకు, తన అనుచరులకు పార్టీలో సరైన ప్రాధాన్యం లేదన్న అసంతృప్తితో ఉన్న డీఎస్‌కు తాజా పరిణా మాలు మింగుడు పడటం లేదని, ఆయన కాంగ్రెస్‌లో చేరడం లాంఛనమేనని రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది. మామాలుగా అయితే ఆయన కాంగ్రెస్‌లో చేరడం పెద్ద పనికాదు. కానీ మళ్లీ పిసిసి పగ్గాలు ఇవ్వడానికి కాంగ్రెస్‌ అధిష్టానం కూడా సిద్దంగా ఉన్నట్లు సమాచారం. దీనికితోడు సిఎం కెసిఆర్‌ కూడా డిఎస్‌ను కలవడానికి ఇష్టపడడం లేదంటే పరస్థితి చేయిదాటిపోయిందనే చెప్పాలి. సీఎం కుమార్తె కవిత నేతృత్వంలోని ప్రజాప్రతినిధుల బృందం డీఎస్‌కు వ్యతిరేకంగా లేఖ రాసి చర్యలు తీసుకోవాలని పార్టీని కోరిన సంగతి పక్కన పెడితే.. ఆయన కాంగ్రెస్‌లో చేరేందుకు పూర్వరంగం ఎప్పుడో సిద్ధమైందని సమాచారం. రాహుల్‌ పగ్గాలు చేపట్టాక పరిస్థితులు మారుతున్నాయి. దీనికితోడు సోనియా అంగీకారం మేరకు డిఎస్‌ పార్టీలో చేరేందుకు రంగం సిద్ధమైందన్న చర్చ కాంగ్రెస్‌ వర్గాల్లో జరుగుతోంది. మరోవైపు రాహుల్‌ బాధ్యతలు చేప్టటాక మళ్లీ పాతకాపులను, పట్టున్న నేతలను పార్టీలోకి రప్పించే ప్రయత్నాలు జరుగుతున్నాయి. కిరణ్‌, డిఎస్‌ వ్యవహారాలు ఇందులో భాగమే అన్న ప్రచారం కూడా ఉంది. తెలంగాణలో బిసిలకు పెద్దగా రాజకీయ అధికారం లేదన్న ప్రచారం నేపథ్యంలో డిఎస్‌ను మళ్లీ రప్పించి కాంగ్రెస్‌ పగ్గాలు అప్పగించే అవకాశాలు ఉన్నట్లు ఢిల్లీలో చర్చగా ఉంది. వాస్తవానికి డీఎస్‌ టీఆర్‌ఎస్‌లో చేరగానే డిఎస్‌ స్థాయికి తగ్గట్టు సీఎం కేసీఆర్‌ రాజ్యసభ సభ్యత్వాన్ని ఇచ్చారు. అయితే పదవి ఇచ్చారు కానీ పట్టించుకోవడం లేదనే అసంతృప్తి డీఎస్‌లో చాలా కాలంగా ఉంది. ముఖ్యంగా నిజామాబాద్‌ పార్లమెంటు స్థానంతోపాటు ఆ జిల్లాలోని తన అనుచరులకు తగిన ప్రాధాన్యం ఇవ్వడం లేదనే బాధ ఆయనలో ఉంది. ఈ విషయాన్ని ఆయన పలుమార్లు తన సన్నిహితుల వద్ద చెప్పారు. దీనికితోడు తన ముఖ్య అనుచరుడు భూపతిరెడ్డి విషయంలో పార్టీ తీసుకున్న నిర్ణయం ఆయనకు రుచించడంలేదు. ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్‌కు వ్యతిరేకంగా వ్యవహరిస్తున్నారన్న కారణంతో భూపతిరెడ్డి ని పార్టీ నుంచి సస్పెండ్‌ చేసినప్పుడే టీఆర్‌ఎస్‌ను వీడాలని డీఎస్‌ నిర్ణయించుకున్నట్టు ఆయన సన్నిహితులు చెబుతున్నారు. ఈ పరిణామాలతోనే ఆయన కాంగ్రెస్‌లో చేరేందుకు రంగం సిద్ధం చేసుకున్నట్టు తెలుస్తోంది. గత ఎన్నికల్లో కాంగ్రెస్‌ ఓటమి తర్వాత నాటి పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జ్‌ దిగ్విజయ్‌సింగ్‌ తన పట్ల వ్యవహరించిన తీరు వల్లే పార్టీ నుంచి వెళ్లిపోవాల్సి వచ్చిందని డిఎస్‌ వివరణతో కాంగ్రెస్‌ కూడా ఏకీభవిస్తున్నట్లు సమాచారం. సోనియా కూడా సమ్మతించడంతోపాటు పార్టీలో చేరేందుకు గ్రీన్‌సిగ్నల్‌ ఇచ్చారని కాంగ్రెస్‌ సీనియర్‌ నేతలు అంటున్నారు. డీఎస్‌ కాంగ్రెస్‌లో చేరడానికి ప్రయత్నిస్తు న్నారన్న వార్తలు రాష్ట్ర నాయకులకు చేరాయి. దీంతో బిసి వర్గం నేతలు ఆయన రాకను స్వాగతిస్తున్నారు. ఆయన అయితే విన్నింగ్‌ హ్యాండ్‌ అని చెబుతున్నారు. డీఎస్‌ కాంగ్రెస్‌ పగ్గాలు చేపడితే మళ్లీ పూర్వ వైభవం వస్తుందని అంటున్నారు. ఒకవేళ డిఎస్‌ కాంగ్రెస్‌లో చేరగానే రాజ్యసభకు రాజీనామా కూడా చేస్తారని అంటున్నారు. ఒకటి రెండు రోజుల్లో తెలంగాణలో కీలక పరిణామాలు జరుగగలవని అంటున్నారు. అవన్నీ కూడా కాంగ్రెస్‌ పునరేకీకరణ దిశగా సాగుతాయని అంటున్నారు.