మారుతున్న గజ్వెల్‌ రాజకీయాలు

కెసిఆర్‌కు వ్యతిరేకంగా బలపడుతున్న నేతలు

ఆలోచనలో పడ్డ అసంతృప్త నేతలు

నర్సారెడ్డి సస్పెన్షన్‌తో కాంగ్రెస్‌ మరింత బలోపేతం

గద్దర్‌ మద్దతుతో మారిన సవిూకరణాలు

గజ్వెల్‌,అక్టోబర్‌26(జ‌నం సాక్షి): ముఖ్యమంత్రి సొంత నియోజక వర్గం గజ్వేల్‌ రాజకీయాలు శరవేగంగా మారతున్నాయి. అక్కడ మాజీ ఎమ్మెల్యే రోడ్ల అభివృద్ధి సంస్థ చైర్మన్‌ తూంకుంట నర్సారెడ్డి ఇప్పుడు తిరిగి కాంగ్రెస్‌లో చేరడం ఖాయమైపోయింది. దీంతో ఆయనను తెరాస నుంచి సస్పెండ్‌ చేశారు. గతంలో

ఇక్కడ కాంగ్రెస్‌ అభ్యర్తిగా గెలిచిన నర్సారెడ్డి తెలంగాణ ఏర్పడ్డ తరవాత టిఆర్‌ఎస్‌లో చేరారు. అయితే టిఆర్‌ఎస్‌లో పెద్దగా ప్రయోజనం లేకపోవడంతో పాటు రాజకీయంగా వెనక్కి పోవాల్సిన దుర్గతి ఏర్పడింది. దీంతో తన అనుచరలతో చర్చించి మళ్లీ కాంగ్రెస్‌ గూటికి చేరాలని నిర్ణయించుకున్నారు. గతకొంతకాలంగా ఇక్కడ నర్సారెడ్డి తిరిగి కాంగ్రెస్‌లో చేరుతారని, ఆయన అనుచరవర్గం కూడా చేరుతుందన్న ప్రచారం సాగుతోంది. అయితే ఇప్పటికే టిడిపిలో ఉన్న వంటేరు ప్రతాపరెడ్డి కాంగ్రెస్‌ గూటికి చేరారు. ఆయనే ఇక్కడ కాంగ్రెస్‌ నుంచి పత్యర్థిగా నిలబడతారని అంటున్నారు. ఈ దశలో గద్దరు కూడా తాను అన్ని పక్షాలు ఆమోదిస్తే గజ్వెల్‌ నుంచి పోటీచేస్తానని ప్రకటించారు. దీంతో గజ్వెల్‌ రాజకీయం ఇప్‌ఉడు హాట్‌ టాపిక్‌గా మారింది. నర్సారెడ్డి కొద్ది నెలలుగా టీఆర్‌ఎస్‌ పట్ల అసంతృప్తిగా ఉన్నారు. కొద్ది రోజుల కిందటే కాంగ్రెస్‌లో చేరనున్నట్లు ప్రచారం జరిగింది. హైదరాబాద్‌లోని ఆయన ఇంటికే ఉత్తమ్‌ వచ్చి పార్టీలోకి ఆహ్వానించారు. కానీ, మంత్రి హరీశ్‌రావు రంగంలోకి దిగి పరిస్థితిని చక్కదిద్దారు. దాంతో.. తన ఆరోగ్యం బాగా లేకపోవడంతోనే ఉత్తమ్‌ పరామర్శకు వచ్చారని, తాను టీఆర్‌ఎస్‌ను వీడబోవడం లేదని అప్పట్లో నర్సారెడ్డి స్పష్టం చేశారు. అంతిమంగా నర్సారెడ్డి గురువారం ఉత్తమ్‌తో భేటీ అయ్యారు. ఈ సమావేశంలో కాంగ్రెస్‌లో చేరికపైనే చర్చించినట్లు తెలిసింది. గజ్వేల్‌ నియోజకవర్గ కాంగ్రెస్‌ ఇన్‌చార్జి వంటేరు ప్రతాప రెడ్డి కూడా ఈ భేటీలో పాల్గొన్నారు. నర్సారెడ్డికి మెదక్‌ ఎమ్మెల్యే లేదా ఎంపీగా పోటీ చేసే అవకాశం కల్పిస్తామని, అవి కుదరకపోతే.. కాంగ్రెస్‌ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఎమ్మెల్సీ ఇస్తామని హావిూ ఇచ్చినట్లు తెలిసింది. అనంతరం, కాంగ్రెస్‌ స్టార్‌ క్యాంపెయినర్‌ విజయశాంతితోనూ ఆమె నివాసంలో నర్సారెడ్డి, ప్రతాపరెడ్డి భేటీ అయ్యారు. నర్సారెడ్డి చేరిక తర్వాత గజ్వేల్‌లో భారీ ర్యాలీ నిర్వహిస్తున్నామని, దానికి రావాలని విజయశాంతిని ఆహ్వానించినట్లు తెలిసింది. మొత్తంగా ఇప్పుడు అటు వంటేరు ప్రతాపరెడ్డి, ఇటు నర్సారెడ్డి గ్రూపులు ఏకమవ్వడంతో ఇక్కడ కాంగ్రెస్‌ బలోపేతం అయ్యింది. అఅలాగే గద్దర్‌ రాకతో మరింత బలోపేతం అయ్యింది. స్థానిక నేతలు కూడా టిఆర్‌ఎస్‌ వ్యవహార శైలిపై గుర్రుగా ఉన్నారు. దీంతో కెసిరా/-/-ను ఢీకొనేందుకు కాంగ్రెస్‌ పక్కా స్కెచ్‌ వేస్తోందని అర్థం అవుతోంది. మరోవైపు ఇంతకాలం టిఆర్‌ఎస్‌లో చేరి ఉత్సవ విగ్రహాల్లాగా ఉన్న డాక్టర్‌ యాదవరెడ్డి, ఎలక్షన్‌ రెడ్డి తదితరులు ఎటు తిరుగుతారన్నది కూడా అనుమానంగా ఉంది. గజ్వెల్‌ తెలంగాణ అడ్వకేట్స్‌ జెఎసి ఛైర్మన్‌ వివి రమణ కూడా తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. తెలంగాణ కోసం వీధుల్లపడి కొట్లాడితే కెసిఆర్‌ తమను కనీసంగా మర్యాదకోసమైనా తమను గుర్తించడం లేదన్న భావనలో వీరు ఉన్నారు. మరోవైపు వంటేరు ప్రతాపరెడ్డి కూడా బహిరం చర్చకు సిఎం కెసిఆర్‌పై సవాళ్లు విసరుతున్నారు. కాంగ్రెస్‌ పార్టీ అధికారంలోకి వస్తే రైతులకు ఏకకాలంలో రూ.2 లక్షల లోపు పంట రుణాలు మాఫీ చేస్తుందని పేర్కొన్నారు. కాంగ్రెస్‌ ప్రభుత్వం ఏర్పాటు కాగానే నిరుపేదలకు ఇళ్లు నిర్మించుకోడానికి ఎస్సీలకు రూ.6 లక్షలు, బీసీలకు రూ.5 లక్షలు, నిరుద్యోగులకు నెలకు రూ.3 వేల భృతి ఇస్తుందని తెలిపారు. కాంగ్రెస్‌పై సీఎం కేసీఆర్‌ చేస్తున్న వ్యాఖ్యలు సరికావన్నారు. రాష్ట్రాన్ని అప్పులపాలు చేసి ప్రజల సమస్యలను పట్టించుకోవడంలో తెరాస ప్రభుత్వం విఫలమయిందని అన్నారు. రైతుల ఇబ్బందులను తీర్చడంలో తెరాస ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేదన్నారు. వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్‌ ఘన విజయం ఖాయమని అన్నారు.