మార్కెట్‌లో పోటెత్తుతున్న తెల్ల బంగారం
ఖమ్మం, అక్టోబర్ 30 : ఖమ్మం పట్టణంలోని వ్యవసాయ మార్కెట్‌లో పత్తి నిల్వలు పోటెత్తుతున్నాయి మంగళవారం నాడు 60వేల బస్తాలు మార్కెట్‌కు రావడం విశేషం. జిల్లాతో పాటు వరంగల్, నల్గొండ జిల్లాల నుంచి నిల్వలు వచ్చాయి. మార్కెట్‌లో కాలుపెట్టే స్థలం లేకండా, పత్తి బస్తాలతో కిటకిటలాడింది. భారీ సంఖ్యలో వాహనాలు రావడంతో ట్రాఫిక్‌కు అంతరాయం ఏర్పడింది. తెల్లవారు జామున మొదలుకొని ఉదయం 10గంటల వరకు పత్తిని మార్కెట్‌కు తరలిస్తునే ఉన్నారు. మార్కెట్ సమీపంలో వాహనాలతో నిండిపోయాయి. మిర్చి యార్డుకు, అపరాల యార్డుకు కూడా పత్తిని తరలించారు. వ్యాపారులు అక్కడే కొనుగోలు చేశారు. దూర ప్రాంత ప్రజల నుంచి వచ్చిన వాహనాల్లోని పత్తి బస్తాలను మార్కెట్‌లోకి మోసుకుంటు వచ్చారు. మార్కెట్ అధికారులు ఈసారి వ్యాపారులు పత్తి కొనుగోలు చేయడానికి ఫ్లాట్ ఫారాలు ఏర్పాటు చేయడంతో కొంత వరకు రద్దీ తగ్గింది.