మాల్యా ఆస్తులు అమ్మి

రూ. 963కోట్లు సేకరించాం
– యూకే అధికారులతో కలిసి పనిచేస్తున్నాం
– ఎస్‌బీఐ ఎండీ అర్జిత్‌ బసు వెల్లడి
న్యూఢిల్లీ, జులై6(జ‌నం సాక్షి) : పలు బ్యాంకులకు వేల కోట్ల రూపాయల రుణాలు ఎగ్గొటి విదేశాలకు పారిపోయినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న విజయ్‌ మాల్యా కేసులో దేశీయ బ్యాంకులకు అనుకూలంగా యూకే హైకోర్టు ఇటీవల ఉత్తర్వులు జారీ చేసింది. ఈ ఉత్తర్వులపై బ్యాంకుల కన్సార్టియం హర్షం వ్యక్తం చేసింది. మాల్యా నుంచి రుణాలు రాబట్టేందుకు యూకే అధికారులతో కలిసి పనిచేస్తున్నట్లు దేశీయ అతిపెద్ద ప్రభుత్వ రంగ బ్యాంకు స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా(ఎస్‌బీఐ) ఎండీ అర్జిత్‌ బసు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ‘యూకే హైకోర్టు ఉత్తర్వులతో సంతృప్తిగా ఉన్నామన్నారు. ఈ ఉత్తర్వులతో మాల్యా ఎగ్గొట్టిన రుణాల్లో చాలా వరకు తిరిగి సేకరించగమని విశ్వసిస్తున్నామని అర్జిత్‌బస్సు తెలిపారు. ఇందుకోసం యూకే అధికారులతో కలిసి పనిచేస్తున్నామని, భారత్‌లో మాల్యాకు చెందిన ఆస్తులను వేలం వేసి ఇప్పటివరకు రూ. 963కోట్ల రుణాలు సేకరించాం అని ఎస్‌బీఐ ఎండీ అర్జిత్‌ తెలిపారు. మాల్యాకు రుణాలు మంజూరు చేసిన 13 బ్యాంకుల కన్సార్టియంకు ఎస్‌బీఐ ప్రాతినిథ్యం వహిస్తోంది. మాల్యాకు యూకేలో ఉన్న ఆస్తుల్లో న్యాయస్థాన అధికారులు అడుగుపెట్టేందుకు లండన్‌ హైకోర్టులోని క్వీన్స్‌ ధర్మాసనం ఇటీవల అనుమతి మంజూరు చేసిన విషయం తెలిసిందే. లండన్‌ సవిూపంలో మాల్యాకు పలు ఆస్తులున్నాయి. ఈ భవంతుల్లో సోదాలు జరిపి, అక్కడి వస్తువులపై నియంత్రణకు ఈ ఉత్తర్వులు అవకాశం కల్పిస్తున్నాయి.