మావోయిస్టు ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించిన జిల్లా కలెక్టర్, ఎస్పి

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బ్యూరో, జూన్ 3 (జనంసాక్షి) : చర్ల మండలం లోని మావోయిస్టు ప్రభావిత ప్రాంతాలైన వద్దిపేట, పూసుగుప్ప, ఉంజు పల్లి గ్రామాలలో జిల్లా కలెక్టర్ అనుదీప్, ఎస్పీ సునీల్ దత్ లు శుక్రవారం విస్తృతంగా పర్యటించారు. పూర్తిగా మావోయిస్టు ప్రభావిత ప్రాంతం కావడంతో అక్కడి గిరిజనుల సమస్యలను అడిగి తెలుసుకొని ముచ్చటించారు. ముఖ్యంగా త్రాగు, సాగునీటి సౌకర్యాల కల్పన కోసం కలెక్టర్ కు గిరిజన రైతులు విన్నవించుకున్న నేపథ్యంలో ఆ సమస్యల  గూర్చి సమస్యలను ఎంతో ఓపికగా అడిగి తెలుసుకున్నారు. సాగునీటి కోసం తాలిపేరు నదికి మోటార్లు కావాలని విన్నవించుకోగా సమస్యలను పరిష్కరిస్తామని సానుకూలంగా స్పందించి సత్వరమే పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. అనంతరం పోలీసు బలగాల కోసం ఏర్పాటు చేసిన జాయింట్ టాస్క్ఫోర్స్ క్యాంపులను సందర్శించారు.ఉంజుపల్లి, వద్దిపేట గ్రామాల ప్రజలతో ఏర్పాటు చేసిన సమావేశంలో పాల్గొని వారి సమస్యలను అడిగి వీలయినంత త్వరలో వాటిని పరిష్కరిస్తామని కలెక్టర్,ఎస్పీ లు వారికి హామీ ఇచ్చారు. జిల్లాలోని మావోయిస్ట్ ప్రభావిత ప్రాంతాల్లో నివసించే ప్రజల సంక్షేమం కోసం అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేపడుతున్నామని, సమస్యలను అధికారుల దృష్టికి తీసుకురావాలని తెలియజేశారు. పూర్తిగా మావోయిస్టు ప్రభావిత ప్రాంతం కావడంతో అత్యంత గోప్యంగా  అధికారుల పర్యటన సాగింది.ఈ కార్యక్రమంలో సీర్పీఎఫ్ 81 బెటాలియన్ సీనియర్ కమాండెంట్ సంజీవ్ కుమార్,ఓఎస్డీ వి.తిరుపతి ఐపీఎస్,భద్రాచలం ఏఎస్పీ రోహిత్ రాజు ఐపీఎస్,చర్ల సిఐ అశోక్,ఎస్బి సిఐ రాజు,ఎస్సైలు రాజు వర్మ,వెంకటప్పయ్య లు పాల్గొన్నారు.