మావోల కదలికలపై.. నిఘా పెట్టాం

– డీజీపీ మహేందర్‌రెడ్డి
కరీంనగర్, నవంబర్1(జనంసాక్షి) : మావోయిస్టుల కదలికలపై నిఘా పెట్టాలరని, తెలంగాణలోకి చొరబడే అవకాశమే లేదని డీజీపీ మహేందర్‌రెడ్డి స్పష్టం చేశారు. గురువారం ఆయన గోదావరిఖనిలో పర్యటించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఒకవేళ మావోలు చొరబడేందుకు ప్రయత్నిస్తే తిప్పికొడతామని తెలిపారు. సరిహద్దు ప్రాంతాల్లో మావోల కదలికలపై ప్రత్యేక నిఘా పెట్టామన్నారు. మహారాష్ట్ర పోలీస్ ఉన్నతాధికారుల దగ్గర నుంచి రేంజ్ స్థాయి అధికారుల వరకు సమన్వయం చేసుకుంటున్నామని వివరించారు. అంతేకాకుండా సరిహద్దుల్లో అదనపు బలగాలను మోహరింపజేస్తామని చెప్పారు. ఎన్నికలు ప్రశాంతంగా నిర్వహించేందుకు కట్టుదిట్టమైన చర్యలు తీసుకున్నామని వివరించారు. శాఖల సమన్వయంతో ఎన్నికల్లో ఎలాంటి ఘటనలు జరగకుండా చర్యలు చేపడతామని పేర్కొన్నారు. ప్రతీ పోలింగ్ స్టేషన్లలో పోలీసులు ఉంటారని వెల్లడించారు.



