మిడతల దాడిని ఎదుర్కొనేందుకు రైతులకు మార్గదర్శకాలు జారీ

భువనేశ్వర్‌: రాష్ట్రానికి మరో కొత్త విపత్తు ముంచుకొస్తోంది. మిడతల దండు దాడి చేసి పంటల్ని నాశనం చేసే ముప్పు పొంచి ఉంది. వాతావరణంలో మార్పుల నేపథ్యంలో మిడతలు విజృంభిస్తాయని  నిపుణులు అభిప్రాయ పడుతున్నారు. మిడతల దాడిని  ప్రపంచంలోనే అత్యంత భయంకరమైన క్రిమి సమూహ దాడిగా పరిగణిస్తున్నారు. తూర్పు ఆఫ్రికా నుంచి పాకిస్థాన్‌ మీదుగా మిడతల దండు ప్రయాణం ప్రారంభమైంది. దేశంలోని రాజస్థాన్, మధ్యప్రదేశ్, ఉత్తర ప్రదేశ్‌ ప్రాంతాల్లో పంటలకు అపారంగా నష్టం కలిగించాయి. ఢిల్లీ దిశగా మిడతల దండు పయనిస్తోంది. ఈ క్రమంలో రాష్ట్రంలో  ఆ  సమూహం చొరబడే ప్రమాదం పొంచి ఉన్నట్లు సర్వత్రా భయాందోళనలు వ్యక్తమవుతున్నాయి.గాలిలో ఎగిరే క్రిమి జాతి మిడతల సమూహం. సాధారణంగా ఏటా జులై నుంచి అక్టోబరు మధ్య వీటి ప్రయాణం ప్రారంభమవుతుంది. వేగవంతమైన గాలులతో నిత్యం 150 కిలోమీటర్ల దూరం నిరవధికంగా ఎగురుతాయి. దారి పొడవునా లభించే ఆకులు, పువ్వులు, పండ్లు, గింజలు, చెట్టు బెరడు అత్యంత వేగంగా ఆరగించి అక్కడనే ముసురుకుని బసచేస్తాయి. దీంతో వృక్ష సంపద, ఉద్యాన పంటలు అపారంగా దెబ్బ తినే ప్రమాదం పొంచి ఉంది. వీటి సంతతి వృద్ధి చెందితే మానవాళి తీవ్రంగా ప్రభావితమవుతుంది. పగటి పూట ఇవి గాలితో పయనిస్తాయి. సాయంత్రం పంట పొలాల గమ్యానికి చేరుతాయి. ప్రధానంగా కోతకు సిద్ధమైన పంటల్ని ప్రధాన ఆహారంగా స్వీకరిస్తాయని నిపుణులు చెబుతున్నారు.

రాష్ట్ర చరిత్రలో ఇంతవరకు మిడతల దాడి జరిగిన దాఖలాలు లేనట్లు ఒడిశా యూనివర్సిటీ ఆఫ్‌ అగ్రికల్చర్‌ అండ్‌ టెక్నాలజీ (ఓయూఏటీ) డీన్‌ లలిత్‌ మోహన్‌ గొడొనాయక్‌ తెలిపారు. ప్రస్తుత వాతావరణ పరిస్థితుల దృష్ట్యా మిడతల సమూహం దాడి చేసే ఆస్కారం ఉండడంతో ముందస్తు జాగ్రత్త అవసరమని ఆయన హితవు పలికారు. మిడతల దాడి రాష్ట్ర వ్యవసాయ రంగాన్ని విపరీతంగా ప్రభావితం చేస్తుంది. పరోక్షంగా ఆర్థిక రంగం బలహీన పడుతుంది. స్థానిక ఒడిశా యూనివర్సిటీ ఆఫ్‌ అగ్రికల్చర్‌ అండ్‌ టెక్నాలజీ ఆధ్వర్యంలో డైరెక్టరేట్‌ ఆఫ్‌ ఎక్స్‌టెన్షన్‌ ఎడ్యుకేషన్‌ విభాగం ఈ విపత్తు నుంచి బయట పడేందుకు కొన్ని ముందస్తు నివారణ జాగ్రత్తలు జారీ చేసింది. మిడతల దాడి నుంచి పంటలకు నష్టం వాటిల్లకుండా చేసేందుకు అనుబంధ వర్గాల నిపుణులు రాష్ట్ర రైతాంగానికి అనుక్షణం సముచిత సలహాలు, సంప్రదింపులతో మార్గదర్శకంగా నిలవాలని  రాష్ట్ర వ్యవసాయ, రైతు సాధికారత విభాగం మంత్రి డాక్టర్‌ అరుణ్‌ కుమార్‌ సాహు పిలుపునిచ్చారు.

ఓయూఏటీ జారీ చేసిన సూచనలు  
5 శాతం వేప గింజల గుజ్జుతో (ఎన్‌ఎస్‌కేఈ) 200 లీటర్ల ద్రవ మిశ్రమం  పిచికారీ  చేయడం ప్రాథమిక నివారణ చర్య.
1 ఎకరం విస్తీర్ణంలో 1 లీటరు వేప గింజల గుజ్జు–300 పీపీఎస్‌ 200 లీటర్ల నీటిలో కలిపి మద్యాహ్నం పిచికారీ చేయాలి.
200 లీటర్ల నీటిలో 400 మిల్లీ లీటర్ల ప్రొఫెనోఫాస్‌ 50 ఈసీ కలిపిన మిశ్రమాన్ని పిచికారీ చేయాలి.
డబ్బాలు, పాత్రలు వాయించి చప్పుడు చేయడం మిడతల దాడి నివారణకు మరో ఉపాయం.
ముళ్ల కంచెతో రువ్వుతూ మిడతల సమూహాన్ని పారదోలాలి.
చెట్లకు చుట్టుముట్టిన మిడతల సమూహం తొలగింపుకు చెట్ల కింద పాలిథిన్‌ షీటు పరిచి కొమ్మల్ని ఊపడంతో నేల రాలతాయి. వీటిని కిరసనాయిలు మిశ్రమ నీటిలో పోసి దూరంగా పారబోయాలి.
తరచూ జారీ చేసే వ్యవసాయ సూచనల్ని క్రమం తప్పకుండా ఆచరించాలి.