మిషన్ భగీరథ సకాలంలో పూర్తి కావాలి
అధికారులకు మంత్రి ఆదేశాలు
నాగర్ కర్నూల్,ఆగస్ట్28(జనం సాక్షి): త్వరితగతిన మిషన్ భగీరథ పైపులైన్ పనులు పూర్తి చేయాలని అధికారులను మంత్రి జూపల్లి కృష్ణారావు ఆదేశించారు. జిల్లాలోని కొల్లాపూర్ పట్టణంలో మంత్రి జూపల్లి కృష్ణారావు పర్యటించారు. పర్యటనలో భాగంగా మంత్రి జూపల్లి పలు కాలనీలను సందర్శించి..మిషన్ భగీరథ పైపులైన్ పనులను పరిశీలించారు. మంత్రి వెంట పలువురు ప్రజాప్రతినిధులు, ఉన్నతాధికారులు ఉన్నారు. హైదరాబాద్ కొంగర కలాన్ లో వచ్చే నెల 2న అసాధారణమైన స్థాయిలో ప్రగతి నివేదన సభ జరగబోతోందని మంత్రి చెప్పారు. ఎన్నికలు ఎప్పుడు జరిగినా వందకు పైగా సీట్లు గెలుస్తామని ఆయన ధీమా వ్యక్తం చేశారు. గత ఎన్నికల్లో ప్రజలకు ఇచ్చిన హావిూలను నెరవేర్చిన ఘనత తమేదనని మంత్రి చెప్పారు. హావిూ ఇవ్వకున్నా అనేక కొత్త పథకాలను అమలు చేస్తున్నామన్నారు. తెలంగాణ ప్రజలే టీఆర్ఎస్ కు హైకమాండ్ అని స్పష్టం చేశారు. సభ విజయవంతం చేసేందుకు ప్రజలు స్వచ్ఛందంగా తరలి వస్తామంటున్నారని వెల్లడించారు. సభ జరిగే సెప్టెంబర్ 2వ తేదీన ఆర్టీసీ బస్సులు, ప్రైవేట్ వాహనాలు పెద్ద సంఖ్యలో సభ కోసం అద్దెకు తీసుకుంటున్నామని, ప్రజలు వీలైతే ఆ రోజు ప్రయాణాలు రద్దు చేసుకోవాలని విజ్ఞప్తి చేశారు. కాంగ్రెస్ నాయకులు నోటికొచ్చినట్లు మాట్లాడుతున్నారని మండిపడ్డారు. కాంగ్రెస్ నాయకులు గందరగోళ పరిస్థితిలో ఉన్నారని ఎద్దేవా చేశారు. కాంగ్రెస్ సమస్యల వలయంలో కాంగ్రెస్ చిక్కుకుందని వ్యాఖ్యానించారు. సహజంగా ఎన్నికలంటే అధికార పక్షం భయపడుతుందని, కానీ తామే ప్రజల దగ్గరికి వెళ్లి తేల్చుకుందామంటే ప్రతిపక్షాలు పారిపోతున్నాయని విమర్శించారు.ఈ సభ చరిత్రలో మైలురాయిగా నిలిచిపోతుందని, విజయవంతంగా నిర్వహిస్తామన్నారు. ఎన్నికలు ఎప్పుడు వచ్చినా టీఆర్ఎస్ను గెలిపించేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారని స్పష్టం చేశారు.