మీడియాతో మీకేం పని ?
సీబీఐ జేడిపై హైకోర్టు సీరియస్
హైదరాబాద్, జూలై 2 (జనంసాక్షి): ముఖ్యమైన కేసులు దర్యాప్తు చేస్తున్న సందర్భంలో దర్యాప్తు సంస్థ మీడియాతో మాట్లాడాల్సిన అవసరం ఏమిటని హైకోర్టు సీబీఐని ప్రశ్నించింది. సీబీఐ జేడీ లక్ష్మీనారాయణ కాల్ లిస్టుల వ్యవహారంపై దాఖలైన ప్రజాప్రయోజన వ్యాజ్యం (పిల్)ను హైకోర్టు సోమవారం విచారణకు స్వీకరించింది. జగన్ ఆస్తుల కేసు దర్యాప్తు జరుపుతున్న సీబీఐ జేడీ లక్ష్మీనారాయణ పక్షపా తంగా వ్యవహరిస్తున్నారని, దర్యాప్తు వివరాలను ఒక వర్గం మీడియాకు వెల్లడిస్తున్నారని గుంటూ రుకు చెందినభూషణ్ బి భవనం పిల్ దాఖలు చేశారు. దీనిని విచారణకు స్వీకరించిన హైకోర్టు సీబీఐ జేడీ తీరుపై ఆగ్రహం వ్యక్తం చేసింది. ఆయన తీరుమార్చుకోవాలని ఆయన తరుఫు న్యాయవాదులకు సూచించింది. మీడియా దర్యాప్తు అంశాలను వెల్లడిస్తున్నారని, ఇది సీబీఐ మాన్యువల్‌కు విరుద్ధమని, అధికార దుర్వినియోగం కిందకు వస్తుందని భూషణ్ తన పిల్‌లోపేర్కొన్నారు. కేంద్ర హోంశాఖ కార్యదర్శి, బీఎస్‌ఎన్‌ఎల్ జీఎం, సీబీఐ జేడీ, ఇద్దరు ప్రతికాధిపతులను ప్రతివాదులుగా చేర్చారు. 2011 నుంచి జేడీ కాల్ లిస్టులు, ఎస్‌ఎంఎస్‌లపై పూర్తి స్థాయి విచారణ జరపాలని ఆయన కోరారు. పిల్‌ను విచారణకు స్వీకరించిన హైకోర్టు జేడీ కాల్ లిస్టు వివరాలను పూర్తిగా అందించాలని ఆదేశించింది. మీడియాతో అన్ని సార్లు ఎందుకు మాట్లాడాల్సి వచ్చిందో కచ్చితంగా వివరణ ఇవ్వాలని సీబీఐని ఆదేశించింది. తదుపరి విచారణను ఈ నెల 9వ తేదీకి హైకోర్టు వాయిదా వేసింది.