‘మీ సేవ’ ద్వారా మరింత మెరుగైన సేవలు
మెదక్, అక్టోబర్ 7: ‘మీ సేవ’ ద్వారా ప్రజలకు మెరుగైన సేవలు అందించాలని మెదక్ సబ్ కలెక్టర్ భారతి కులికేరి అన్నారు. ఆదివారం నాడు తహశీల్దార్ కార్యాలయ ఆవరణలో మెదక్ రెవెన్యూ డివిజన్‌కు చెందిన తహశీల్దార్లు, కంప్యూటర్ ఆపరేటర్లు, మీ సేవ ఆపరేటర్లు శిక్షణ శిక్షణ శిబిరాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ప్రభుత్వం నిర్ణయించిన ధర కంటేఎక్కువవసూలు చేస్తే వారిపై చర్యలు తీసుకుంటామన్నారు. తహశీల్దార్లు ప్రతిరోజూ మీ సేవ కేంద్రాల పనితీరును పరిశీలించి నివేదికను తయారు చేయాలన్నారు. మెదక్ డివిజన్ కేంద్రంలో 48 కేంద్రాలు పనిచేస్తున్నాయని ఆమె తెలిపారు. జిల్లా వ్యాప్తంగా 133 మీ సేవ కేంద్రాలు పనిచేస్తున్నాయని, మరో వంద కేంద్రాలను ప్రారంభిస్తామన్నారు. మీ సేవ ద్వారా ప్రజలకు 17 రకాల సేవలను అందిస్తున్నామన్నారు. ప్రజలు ఇచ్చిన దరఖాస్తులను కాలయపన చేయకుండా సత్వరమే సర్టిఫికెట్లను జారీచేయాలన్నారు. తెలంగాణ ప్రాంతంలో మీ సేవ కేంద్రాల పనితీరులో రెండవ స్థానంలో ఉందని ఆమె పేర్కొన్నారు. గ్రామీణ ప్రజలకు అర్థమయ్యేలా మీ సేవల గురించి ప్రచారం చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో సివిల్‌సప్లాయీస్ డీఎం వీరారెడ్డి ఆపరేటర్లకు కొన్ని మెలకువలను నేర్పారు. ఈ కార్యక్రమంలో 18 మండలాల తహశీల్దార్లు, మీ సేవ కేంద్రాల ఆపరేటర్లు, కంప్యూటర్ ఆపరేటర్లు తదితరులు పాల్గొన్నారు.