ముంబయిలో మరో వంతెనకు పగుళ్లు!

– అప్రమత్తమైన పోలీసులు, ట్రాఫిక్‌ మళ్లింపు
ముంబయి, జులై4(జ‌నం సాక్షి ) : భారీవర్షాల కారణంగా ముంబయిలోని అంధేరి స్టేషన్‌ వద్ద మంగళవారం పాదచారుల వంతెన కూలిపోయిన సంగతి తెలిసిందే. కాగా బుధవారం మరో బ్రిడ్జిపై పగుళ్లు రావడంతో పోలీసులు అప్రమత్తమయ్యారు. గ్రాండ్‌ రోడ్‌ స్టేషన్‌ వద్ద.. గ్రాండ్‌ రోడ్‌ను నానా చౌక్‌ను కలిపే వంతెనపై రోడ్డుకు పగుళ్లు వచ్చాయి. గుర్తించిన పోలీసులు ఆ రోడ్డుపై వాహన రాకపోకలను నిలిపివేశారు. ట్రాఫిక్‌ను మరోవైపు మళ్లించారు. రోడ్డుకు పగుళ్లు వచ్చిన ఫొటోను ముంబయి పోలీసులు ట్విటర్‌లో పోస్ట్‌ చేశారు. ట్రాఫిక్‌ను నానా చౌక్‌ వైపు నుంచి కెన్నెడీ బ్రిడ్జి వైపు మళ్లిస్తున్నట్లు తెలిపారు. గత రెండు రోజులుగా ముంబయిని భారీ వర్షాలు ముంచెత్తుతున్నాయి. బుధ, గురువారాల్లో కూడా నగరంలో భారీ వర్షాలు పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది. దీంతో నగర వాసులు ఆందోళన చెందుతున్నారు. ఇప్పటికే నగరంలోని లోతట్టు ప్రాంతాలన్నీ జలమయమయ్యాయి. మంగళవారం అంధేరి వద్ద వంతెన కూలి దాదాపు అయిదుగురు గాయపడ్డారు. పశ్చిమ రైల్వే సర్వీసులన్నీ ఉదయం నుంచి సాయంత్రం దాకా నిలిచిపోవడంతో ప్రజలు తీవ్రంగా ఇబ్బందులు పడ్డారు. అంధేరి ఘటనతో రైల్వే అధికారులు కూడా అప్రమత్తమయ్యారు. నగరంలోని వంతెనలన్నీ పరిశీలిస్తామని తెలిపారు.