ముంబయిలో వర్షభీభత్సం

– ఎడతెరిపిలేకుండా కురుస్తున్న వర్షం
– రికార్డు స్థాయిలో వర్షపాతం నమోదు
– జలమయమైన రహదారులు
– ఐదుగురు మృతి
ముంబయి, జూన్‌25(జ‌నం సాక్షి ) : ముంబయి నగరాన్ని మరోసారి భారీ వర్షం ముంచెత్తాయి. ఆదివారం రాత్రి నుంచి కురుస్తోన్న భారీ వర్షంతో నగరవాసులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. సోమవారం ఉదయం పాఠశాలలు, కళాశాలలు, కార్యాలయాలకు వెళ్లే సమయంలో వర్షం కారణంగా ట్రాఫిక్‌కు ఆటంకం కలిగింది. లోకల్‌ రైళ్లు ఆలస్యంగా నడుస్తున్నాయి. నగరంలో చాలా చోట్ల రోడ్లపైకి భారీగా వర్షపునీరు చేరింది. లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. దక్షిణ ముంబయిలోని వడాలా ప్రాంతంలో గోడ కూలింది. అయితే ఈ ఘటనలో ఎవరూ గాయపడలేదు. భారీ వర్షం ప్రభావం అంధేరి, ఖర్‌, మలద్‌ ప్రాంతాల్లో తీవ్రంగా ఉంది. ఆదివారం ఉదయం 8.30 నుంచి సాయంత్రం 4.30 వరకు ముంబయిలో రికార్డు స్థాయిలో అత్యధికంగా 110.80మిల్లీవిూటర్ల వర్షపాతం నమోదైనట్లు వాతావరణ శాఖ అధికారులు వెల్లడించారు. సోమ, మంగళవారాల్లో కూడా భారీ వర్షాలు పడతాయని.. నగరవాసులు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. దాదాపు 2వేల మందికిపైగా ట్రాఫిక్‌ పోలీసులు పరిస్థితిని నియంత్రిస్తున్నారు. భారీ వర్షాలకు ట్రాఫిక్‌ ఇబ్బందులు, రోడ్లు జలమయమైన ఫొటోలను ముంబయి వాసులు ట్విటర్‌లో షేర్‌ చేస్తున్నారు. వర్షం కారణంగా ముంబైలో ఇద్దరు, థానేలో మరొకరు మృతి చెందారు. లోతట్టు ప్రాంతాల్లోని నీటిని బయటకు పంపేందుకు మున్సిపల్‌ అధికారులు చర్యలు చేపట్టారు. భారీ వర్షాల కారణంగా రైళ్లు ఆలస్యంగా నడుస్తున్నాయి. కొన్ని రైళ్లు రద్దు అయ్యాయి. ట్రాఫిక్‌కు అంతరాయం ఏర్పడింది. అన్‌టాప్‌ హిల్‌ ప్రాంతంలో ప్రహరీ గోడ కుప్పకూలింది. గోడ కూలడంతో 15 కార్లు శిథిలాల్లో కూరుకుపోయాయి. భవనంలో చిక్కుకున్న వారిని రక్షించేందుకు అగ్నిమాపక సిబ్బంది ప్రయత్నిస్తుంది. ఈ భవనంలో సీనియర్‌ లాయర్లు, పేరున్న వ్యాపారుల నివాసాలు ఉన్నాయని పోలీసులు తెలిపారు. దీంతో హుటాహుటీన వారిని భవనాన్ని ఖాళీ చేయిస్తున్నామని చెప్పారు. ముంబైలో గడిచిన 24 గంటల్లో 231.4 మిల్లివిూటర్ల వర్షపాతం నమోదైంది. అత్యవసర పరిస్థితుల్లోనే బయటకు రావాలని ముంబై ప్రజలకు పోలీసులు విజ్ఞప్తి చేశారు.