ముంబయి జుహు బీచ్‌లో విషాదం

– ఈతకు వెళ్లిన నలుగురు యువకులు గల్లంతు
– ముగ్గురి మృతదేహాలు వెలికితీత
ముంబయి, జులై6(జ‌నం సాక్షి) : ముంబయి జుహు బీచ్‌లో విషాధం చోటు చేసుకుంది. గురువారం సాయంత్రం బీచ్‌లో ఈతకు వెళ్లిన ఏడుగురిలో నలుగురు గల్లంతయ్యారు. కాగా గజ ఈతగాళ్ల సాయంతో నలుగురిలో ముగ్గురి మృతదేహాలు శుక్రవారం వెలికితీశారు. వివరాల్లోకి వెళితే.. అంధేరిలోని డీఎన్‌ నగర్‌ ప్రాంతానికి చెందిన ఏడుగురు స్పేహితులు గురువారం సాయంత్రం జుహు బీచ్‌కు వెళ్లారు. వారిలో ఐదుగురు యువకులు సముద్రంలోకి దిగారు. పెద్ద అల రావడంతో వారిలో నలుగురు నీటిలో మునిగిపోయారని, ఒకరు మాత్రం సురక్షితంగా బయటపడ్డారని జుహు పోలీస్‌ స్టేషన్‌ అధికారి వెల్లడించారు. సముద్రంలో గల్లంతైన నలుగురూ 17ఏళ్ల వయసు వారే. వారిని ఫర్దీన్‌ సౌదాగర్‌, సొహైల్‌ ఖాన్‌, ్గ/సైల్‌ షేక్‌, నజీర్‌ గాజిగా గుర్తించారు. సురక్షితంగా బయటపడిన యువకుడు 22ఏళ్ల వాసిమ్‌ ఖాన్‌.
గల్లంతైన వారి కోసం గురువారం రాత్రంతా గాలింపు చర్యలు కొనసాగించారు. ఈరోజు కూడా సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. నావికాదళం, తీరప్రాంత రక్షణ దళాలకు చెందిన చేతక్‌ విమానాలతో పాటు నేవీ డైవింగ్‌ బృందం గాలింపు చర్యల్లో పాల్గొంటున్నాయి. ఇప్పటి వరకు ముగ్గురి మృతదేహాలు లభ్యమయ్యాయి. మరో యువకుడి కోసం గాలిస్తున్నారు. నిన్న యువకులు సముద్రంలోకి వెళ్తుంటే స్థానికులు, మత్స్యకారులు వద్దని వారించారని పోలీసులు తెలిపారు. వాతావరణ పరిస్థితులు అనుకూలంగా లేవని, వర్షం పడుతోందని, ఇంటి దగ్గరే ఉండమని తన కొడుకుకు చెప్పానని, వాడు బీచ్‌కు వెళ్తున్న సంగతి తనకు తెలియదని ఫర్దీన్‌ తండ్రి ఆవేదన వ్యక్తంచేశారు. కాగా మృతుల కుటుంబ సభ్యులు, బంధువుల రోధనలతో బీచ్‌ పరిసరాల్లో విషాధ చాయలు అలముకున్నాయి. రాత్రంత్రా బీచ్‌ వద్దే ఉన్న వారు తమ కొడు కు మృత్యుంజయుడిగా వస్తాడని ఆశతో ఎదురుచూశారు. కానీ శుక్రవారం ఉదయం వారి మృతదేహాలను అధికారులు గుర్తించి కుటుంబ సభ్యులకు అప్పగించారు. అప్పటి వరకు అల్లారుముద్దుగా తమకళ్లముందు తిరిగిన కొడుకు ఇక లేడనే విషాధంలో తల్లిదండ్రులు గుండెలు పగిలేలా రోధించారు.