ముంబయ్‌ సర్కార్‌కు రాజ్‌థాకరే ఔట్‌సోర్సింగా ?

బీహార్‌ ముఖ్యమంత్రి నితీశ్‌కుమార్‌ ధ్వజం
ఎంఎన్‌ఎస్‌ వైఖరిపై ఉత్తర భారతంలో నిరసనలు
ముంబయ,సెప్టెంబర్‌ 2 (జనంసాక్షి): మహారాష్ట్రలో అధికారం ఉన్నది కాంగ్రెస్‌ ప్రభుత్వం గానీ, పాలించేది రాజ్‌ థాకరే అండ్‌ కంపెనీ మరోమారు స్పష్టమైంది. స్థానికత్వం అన్న నినాదంతో ఆయన స్థాపించిన మహారాష్ట్ర నవ నిర్మాణ్‌ సేన ముంబయ్‌ నగరంలో నుంచి బీహారీలను తమ తమ ప్రాంతాలకు బలవంతంగా పంపుతున్నారు. బతకడానికి వచ్చిన ఆ బడుగు జీవులను భయభ్రాంతులకు గురి చేస్తున్నారు. తమ ప్రాంతంలో తాము ఉంటామని, ఇతరులకు స్థానం లేదనిరాజ్‌థాకరే ప్రకటించారు కూడా. ఈ నేపథ్యంలో భారతదేశ వాణిజ్య రాజధాని అట్టుడుకుతున్నది. ప్రజాస్వామ్య దేశంలో ఓ వర్గీయులు రెచ్చిపోతున్నా పాలకులు పట్టించుకోక పోవడం దారుణమని రాజకీయవాదులు విమర్శిస్తున్నారు. బీహారీలపై జరుగుతున్న ఈ బలవంతపు దౌర్జన్యానికి బీహార్‌ రాష్ట్ర సీఎం నితీష్‌కుమార్‌ కూడా మండిపడ్డారు. మహారాష్ట్రలో ఔట్‌ సోర్సింగ్‌ ప్రాతిపదికన ఉద్యోగాలు ఇస్తున్నారా అని నితీష్‌ కేంద్రాన్ని నిలదీశారు. దేశంలో ఏ పౌరుడైనా ఎక్కడైనా ఉండే హక్కు ఉందన్న విషయాన్ని రాజ్‌ థాకరే విస్మరిస్తున్నారని దుయ్యబట్టారు. బీహారీలపై దాడులు ఆగకుంటే యూపీఏ ప్రభుత్వాన్ని వదిలిపెట్టమని ఆల్టిమేటం ఇచ్చారు.