ముంబై కట్టడాలకు యునెస్కో గుర్తింపు

ముంబై,జూన్‌30(జ‌నం సాక్షి): భారత్‌ నుంచి మరో రెండు ప్రఖ్యాత కట్టడాలు యూనెస్కో వారసత్వ సంపదలో చోటు సంపాదించుకున్నాయి. ముంబయికి చెందిన విక్టోరియన్‌ గోతిక్‌, ఆర్ట్‌ డెకో ఎన్‌సింబల్‌ కు యూనెస్కో గుర్తింపు లభించింది. దీంతో భారత్‌ తరపున ఇప్పటికీ 37 ప్రముఖ ప్రాచీన, సాంస్కృతిక కట్టడాలు యూనెస్కో వరల్డ్‌ హెరిటేజ్‌లో స్థానం పొందాయి. బహ్రెయిన్‌లోని మనమలో జరిగిన యూనెస్కో 42వ సమావేశంలో ఈ మేరకు నేడు ప్రకటన చేశారు. యూనెస్కో గైడ్‌లైన్స్‌ ప్రకారం విక్టోరియన్‌ గోతిక్‌, ఆర్ట్‌ డెకో ఎన్‌సింబల్‌ వారసత్వ సంపదకు అర్హత కలిగి ఉన్నాయి. విక్టోరియన్‌ నిర్మాణశైలి 19వ శతాబ్దానికి చెందినదిగా.. ఆర్ట్‌ డెకో బిల్డింగ్‌ 20వ శతాబ్దపు అత్యుత్తమ నిర్మాణ శైలిని కలిగి ఉన్నాయి. ఈ రెండు నిర్మాణాల శైలి ప్రపంచంలోనే అత్యంత అద్భుతమైన సేకరణను సూచిస్తుంది. గడిచిన ఐదేళ్లలో అహ్మదాబాద్‌ తర్వాత ముంబయి నగరమే యూనెస్కో లిస్ట్‌లో స్థానం సంపాదించుకుంది. వారసత్వ సంపద విశిష్టతలు పొందటంలో ప్రపంచం మొత్తంలో భారత్‌ 6వ స్థానంలో ఉంది. అదే ఆసియా పసిఫిక్‌ ప్రాంతంలో చైనా తర్వాత రెండో స్థానంలో ఉంది. ఈ ఘనత సాధించడం పట్ల కేంద్ర సాంస్కృతికశాఖ సహాయ మంత్రి ముంబయి ప్రజలకు అభినందనలు తెలియజేశారు. స్థానిక ఆర్థిక వృద్ధికి ఇది ఎంతో దోహదపడుతుందన్నారు.