ముంబై-గోవా జాతీయ రహదారిలో ఘోరం
– వంతెన కూలి కొట్టుకుపోయిన వాహనాలు
– 20 మంది ప్రయాణికుల గల్లంతు
– నది ఉధృతితో సహాయచర్యలకు ఆటంకం
ముంబై,ఆగస్టు 3(జనంసాక్షి):ముంబై-గోవా జాతీయ రహదారిలో బుధవారం అర్ధరాత్రి దాటిన తర్వాత వంతెన కూలి 20 మంది ప్రయాణికులు గల్లంతయ్యారు. భారీ వర్షాల కారణంగా ఈ వంతెన కుప్పకూలడంతో రెండు బస్సులతో పాటు పలు వాహనాలు నదిలోకి పడిపోయాయి. బస్సులలో 20 మందికి పైగా ప్రయాణికులు ఉన్నారు. వారి ఆచూకీ ఇంతవరకు తెలియలేదు. నది ఉధృతంగా ప్రవహిస్తుండడంతో గాలింపు చేస్తున్నా లాభం లేకుండాపోయింది. దీంతో గల్లంతయిన ప్రయాణికుల ఆచూకీ తెలియడం లేదు. ఎప్పుడో బ్రిటిష్ వాళ్ల హయాంలో నిర్మించిన వంతెన కుప్పకూలడంతో ప్రమాదం జరిగింది. దీంతో దాదాపు 20 మంది గల్లంతయ్యారు. వారి ఆచూకీ ఇంతవరకు తెలియలేదు. గల్లంతైనవారిని గుర్తించేందుకు వీలుగా సీకింగ్ 42బి హెలికాప్టర్‌ను రంగంలోకి దించారు. ఇది ఎలాంటి వాతావరణంలోనైనా ప్రయాణించగలదు. మహద్ పట్టణంలో దాదాపు ఏడు దశాబ్దాల క్రితం నిర్మించిన ఈ వంతెన అర్ధరాత్రి ఒంటిగంట సమయంలో కూలిపోయింది. సావిత్రీ నదిలోకి వరదనీరు వచ్చి చేరడంతో వంతెన పడిపోయింది. బస్సులు, ప్రైవేటు కార్లు కూడా నీళ్లలోకి పడిపోయాయని అంటున్నారు. ముంబై నుంచి బయల్దేరిన రెండు బస్సులు గమ్యస్థానాలకు చేరుకోలేదు. ఇవి కూడా ఈ నదిలో పడిపోయాయనే స్థానికులు చెబుతున్నారు. జాతీయ విపత్తు నివారణ బృందాలు రంగంలోకి దిగాయి. 80 మంది రెస్క్యూ సిబ్బందితోపాటు డైవర్లను కూడా అక్కడకు పంపారు. ప్రధాని నరేంద్రమోదీ మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవిస్‌కు ఫోన్ చేసి, అవసరమైన సహాయ సహకారాలు అందిస్తామని చెప్పారు. ఆ ప్రాంతంలో పక్కపక్కనే రెండు వంతెనలున్నాయని, వాటిలో పాతది కూలిపోయిందని ఫడ్నవిస్ తెలిపారు. మహారాష్ట్రలోని కొంకణ్, ఉత్తర, పశ్చిమ ప్రాంతాల్లో గత ఐదు రోజులుగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. మహారాష్ట్రలో గత రెండ్రోజులుగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. మరో 8 వాహనాలు కూడా నదిలో కొట్టుకుపోయినట్లు అనుమానిస్తున్నారు. సహాయక చర్యలు వేగవంతం చేయాలని మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఫడణవీస్ అధికారులను ఆదేశించారు.ఎన్డీఆర్‌ఎఫ్ సిబ్బందితో సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. గాలింపు చర్యల కోసం తీరరక్షక దళం చేతక్ హెలికాప్టర్‌ను రంగంలోకి దింపింది. సావిత్రినదిపై కూలిన వంతెన బ్రిటీష్ కాలం నాటిదని అధికారులు తెలిపారు. పురాతన వంతెన పక్కనే మరో కొత్త వంతెన కూడా ఉంది. ప్రమాదం జరిగిన తర్వాత అధికారులు కొత్త వంతెనపై నుంచి రాకపోకలు మళ్లించారు.ముంబయి నుంచి ప్రత్యేక అధికారుల బృదం ఘటనాస్థలికి బయలుదేరింది. రాయగఢ్ జిల్లా కలెక్టర్, ఎస్పీ ఘటనాస్థలికి చేరుకుని సహాయక చర్యలను పర్యవేక్షిస్తున్నారు. భారీ వర్షాల కారణంగా సహాయక చర్యలకు ఆటంకమేర్పడుతోంది