ముష్కరులు ఎలా చొరబడ్డారు..? అసలేం జరిగింది..?: పదిమంది ముష్కరులు..?

పంజాబ్‌లో ముష్కరుల దాడి ఎలా జరిగిందనే దానిపై చర్చ సాగుతోంది. పంజాబ్‌లోని దీనానగర్ పోలీస్ స్టేషన్‌పై విరుచుకుపడిన ముష్కరులు పాకిస్థాన్‌లోని నరోవాల్ నుంచి చొరబడినట్లు ఇంటలిజెన్స్ బ్యూరో వర్గాలు తెలిపాయి. ఈ దాడికి ముందు వారి కదలికలను జమ్ములోని హరినగర్‌‍లో గుర్తించినట్టు సమాచారం. హరినగర్ నుంచి అమృత్ సర్-పఠాన్ కోట్ హైవే వద్దకు రాత్రి చేరుకున్న ఉగ్రవాదులు తొలుత ఓ కారును హైజాక్ చేశారు. 
కారులో వెళ్తూ రహదారిపై వెళ్తున్న ఓ బస్సుపై కాల్పులు జరిపిన ముష్కరులు.. ఆపై నేరుగా దీనానగర్ చేరుకుని, అక్కడి పోలీస్ స్టేషన్‌పై కాల్పులకు తెగబడ్డారు. బస్సుపై జరిపిన కాల్పుల్లో ఓ ప్రయాణీకుడు ప్రాణాలు కోల్పోయాడు. 
తర్వాత పోలీస్ స్టేషన్‌ను టార్గెట్ చేసిన తీవ్రవాదులు.. తొలుత గార్డును చంపి, పీఎస్‌లోకి అడుగుపెట్టారు. ఆ తర్వాత పీఎస్‌లోని పోలీసులను, లాకప్‌లో ఉన్న ఇద్దరు వ్యక్తులను కాల్చి చంపి… పోలీస్ స్టేషన్‌‍ను తమ అదుపులోకి తీసుకున్నారు. అనంతరం, ఘటనా స్థలానికి పంజాబ్ పోలీసులతో పాటు భారీ ఎత్తున సైన్యం చేరుకుంది. సైన్యం జరుపుతున్న కాల్పుల్లో ఇప్పటికే ఒక ఉగ్రవాది మరణించినట్టు సమాచారం.
మొత్తం నలుగురి నుంచి 10 మంది వరకు ముష్కరులు దాడిలో పాల్గొన్నట్టు తెలుస్తోంది. దాడికి పాల్పడ్డ వారంతా సుశిక్షితులైన ఉగ్రవాదులే అని భద్రతా దళాలు తెలిపాయి. ఈ ఆపరేషన్ ఇంకా సాగుతోంది.