మూడింటా టిఆర్‌ఎస్‌లో మళ్లీ పాతకాపులే
అంతర్గతంగా రాజుకుంటున్న అసమ్మతి
గెలుపు తమదే అన్న భావనలో కాంగ్రెస్ నేతలు
జనగామ,సెప్టెంబర్8(జనంసాక్షి): కొత్తగా ఏర్పడ్డ జనగామ జిల్లాలో ఉన్న మూడు నియోజకవర్గాల్లో పాతకాపులే మళ్లీ రంగంలోకి దిగడంతో తమకు కలసి వస్తుందిన కాంగ్రెస్ భావిస్తోంది. వీరిపట్ల ప్రజల్లో వ్యతిరేకత ఉందని, అదే తమకు విజయాన్ని తెచ్చిపెడుతుందని భావిస్తున్నారు. ప్రధానంగా జనగామ, స్టేషన్ ఘనాపూర్‌లలో స్థానికంగా ప్రస్తుత ఎమ్మెల్యేలపై వ్యతిరేకత ఉంది. వారిని మారుస్తారని అంతా భావించారు. ఇకపోతే జనగామలో ముత్తిరెడ్డి స్థానంలో ప్రత్యామ్నాయా అభ్యర్థిని రంగంలోకి దింపుతారని భావించారు. ఇటీవలే బిజెపి నుంచి బయటకు వచ్చిన మాజీ ఎమ్మెల్యే ప్రతాపరెడ్డిని టిఆర్‌ఎస్‌లోకి మళ్లీ చేర్చుకుని టిక్కెట్ ఇస్తారని భావించారు. దీంతో ఇప్పుడాయన ఒంటరి అయ్యారు. ఇక్కడ మరోమారు పొన్నాల లక్ష్మయ్య కాంగ్రెస్ నుంచి బరిలోకి దిగబోతున్నారు. టీఆర్‌ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థిగా రెండోసారి టికెట్ ఖరారైన తాజా మాజీ ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి మాత్రం తనకు మళ్లీ టిక్కెట్ రావడంతో గెలుపు ఖాయమని భావిస్తున్నారు. అసెంబ్లీ రద్దు తర్వాత పార్టీ అధినేత కేసీఆర్ ప్రకటించిన తొలి జాబితాలోనే ముత్తిరెడ్డికి చోటుదక్కడంపై ఆయన అనుచరులు హర్షం వ్యక్తం చేశారు. జనగామ నియోజకవర్గ టీఆర్‌ఎస్ అభ్యర్థిగా ఖరారైన ముత్తిరెడ్డి యాదగరిరెడ్డిని కలిసి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ జనగామ టికెట్ మళ్లీ ముత్తిరెడ్డికే కేటాయించడం హర్షణీయమన్నారు. ఇకపోతే స్టేషన్‌ఘన్‌పూర్ నియోజకవర్గ టీఆర్‌ఎస్ అభ్యర్థిగా ఖరారైన డాక్టర్ తాటికొండ రాజయ్యకు పార్టీ శ్రేణులు ఘనస్వాగతం పలికారు. స్టేషన్‌ఘన్‌పూర్, లింగాలఘనపురం, రఘునాథపల్లి మండలాల నుంచి పెద్దఎత్తున తరలివచ్చిన టీఆర్‌ఎస్ కార్యకర్తలు జిల్లా ప్రారంభ సరిహద్దులో ఎదురేగి పుష్పగుచ్ఛాలు అందించి పూలమాలతో ముంచెత్తి శాలువలతో సన్మానించారు. స్టేషన్‌ఘన్‌పూర్ నియోజక వర్గం టికెట్ కేటాయించిన సీఎం కేసీఆర్‌కు కృతజ్ఞతలు చెప్పారు. గతంలో టిఆర్‌ఎస్‌లో ఉండా కాంగ్రెస్‌లో చేరిన మాజీ ఎమ్మెల్యే విజయరామారావు ఇక్కడ మళ్లీ నిలబడతారన్న ప్రచారం ఉంది. ఇక పాలకుర్తిలో టిడిపి నుంచి గెలిచిన ఎర్రబెల్లి టిఆర్‌ఎస్‌లో చేరగా ఆయనకు కూడా టిక్కెట్ ఖరారు చేశారు. అక్కడ జంగారాఘవరెడ్డి కాంగ్రెస్ తరపున నిలబడబోతున్నారు. దీంతో ఈ మూడు నియోజకవర్గాల్లో పోటీ రసవత్తరంగా మారబోతున్నది. జనగామలో ఈ మూడు సీట్లలో పోటీ కూడా టఫ్‌గానే ఉంటుందని భావిస్తున్నారు.