మూడోవిడత పల్లెతీర్పులోనూ కాంగ్రెస్ ఆధిక్యం
` గట్టిపోటీ ఇచ్చిన భారాస
` మూడు విడతల్లో ఎన్నికలు పూర్తి
` 22న సర్పంచ్‌లు, వార్డు సభ్యుల ప్రమాణం
` స్వల్ప ఘర్షణలు మినహా ప్రశాంతంగా ముగిసిన ఎన్నికలు
హైదరాబాద్(జనంసాక్షి):తెలంగాణలో మూడో దశ గ్రామ పంచాయతీ ఎన్నికల్లోనూ కాంగ్రెస్ మద్దతుదారులు పైచేయి సాధించారు. మొత్తం 4,158 స్థానాల్లో అత్యధిక స్థానాల్లో గెలిచి ఆధిక్యాన్ని చాటారు. భద్రాద్రి కొత్తగూడెం, హనుమకొండ, జగిత్యాల, జయశంకర్ భూపాల్‌పల్లి, మహబూబాబాద్, మహబూబ్‌నగర్, మంచిర్యాల, నాగర్ కర్నూల్, నల్గొండ, నిజామాబాద్, పెద్దపల్లి, రంగారెడ్డి, సంగారెడ్డి, సూర్యాపేట, వికారాబాద్, కామారెడ్డి, ఖమ్మం, యాదాద్రి భువనగిరి జిల్లాల్లో అత్యధిక స్థానాలను కాంగ్రెస్ మద్దతుదారులు కైవసం చేసుకున్నారు. రాత్రి 7 గంటల వరకు కాంగ్రెస్ పార్టీ ఏకగ్రీవాలతో కలిపి 1564, భారత రాష్ట్ర సమితి 756, భాజపా 134, ఇతరులు 339 సర్పంచ్ స్థానాల్లో గెలు పొందారు. మూడో దశ ఎన్నికల కోసం 182 మండలాల్లో మొత్తం 4,159 గ్రామ పంచాయతీలకు నోటిఫికేషన్ వెలువడగా… అందులో 11 సర్పంచి పదవులకు నామినేషన్లు దాఖలు కాలేదు. 394 పదవులు ఏకగ్రీవమయ్యాయి. రెండు పంచాయితీల్లో ఎన్నికలపై న్యాయస్థానం స్టే విధించింది. మిగిలిన 3,752 సర్పంచి పదవులకు బుధవారం పోలింగ్ జరిగింది. ఉదయం 7నుంచి 1 గంటవరకు పోలింగ్ జరగగా, 2 గంటల నుంచి కౌంటింగ్ మొదలు పెట్టారు. పలు గ్రామాల్లో ఇంకా కౌంటింగ్ కొనసాగుతోంది. మూదు దశలతో పంచాయితీ సమరం ముగిసింది. గ్రామాల్లో కొత్త సర్పంచ్‌లు ఎన్నికయ్యారు. ఈ నెల 22న సర్పంచ్‌లు, వార్డు మెంబర్లు ప్రమాణం చేస్తారు. దీంతో గ్రామాల్లో పాలన ప్రారంభం కానుంది. తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా మూడో దశ పంచాయతీ ఎన్నికల పోలింగ్ పక్రియ బుధవారం ప్రశాంతంగా ముగిసింది. ఉదయం 7 గంటలకు ప్రారంభమైన ఓటింగ్, మధ్యాహ్నం 1 గంట వరకు కొనసాగింది. గడువు ముగిసే సమయానికి క్యూలైన్‌లో ఉన్న ఓటర్లందరికీ అధికారులు ఓటు వేసే అవకాశం కల్పించారు. ఈ మూడో దశలో రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 3,752 సర్పంచ్ స్థానాలకు, 28,410 వార్డు సభ్యుల స్థానాలకు ఎన్నికలు నిర్వహించారు. అయితే.. మధ్యాహ్నం 1 గంటల వరకు 80.78శాతం పోలింగ్ నమోదయ్యింది. సర్పంచ్ ఎన్నిక ఫలితాలను అధికారికంగా ప్రకటించిన వెంటనే, తదుపరి పక్రియగా ఉప సర్పంచ్ ఎన్నికను నిర్వహించారు. సర్పంచ్ ఫలితం తేలిన తర్వాత, నూతనంగా ఎన్నికైన వార్డు సభ్యులతో ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేసి, వారి సమక్షంలో ఉప సర్పంచ్ ఎన్నికను పూర్తి చేసారు. మెజారిటీ గ్రామాల్లో కొత్త పాలకవర్గాలు కొలువుదీరాయి.
ఆఖరు విడత ప్రశాంతం
తెలంగాణలో మూడు విడతల పంచాయతీ ఎన్నికలు ముగిశాయి.పంచాయతీ ఎన్నికల మూడో దశ పోలింగ్ నేపథ్యంలో పలు చోట్ల ఘర్షణలు చోటుచేసుకున్నాయి. ఓటర్లు ఉదయం నుంచే పోలింగ్ కేంద్రాలకు తరలి వచ్చారు. గ్రామాల్లో ఎన్నికలను ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. ఇతర ప్రాంతాల్లో ఉన్న ఓటర్లను రానుపోను కిరాయి డబ్బులు ఇచ్చి రప్పించారు.ఉదయం 7గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు పోలింగ్ కొనసాగింది. మధ్యాహ్నం ఒంటి గంట వరకు క్యూలో నిల్చున్న వారికి ఓటేసేందుకు అవకాశం కల్పించారు. కాగా, మొదటి, రెండో విడతల ఎన్నికల మాదిరిగానే మూడో విడత తెలంగాణ సర్పంచ్ ఎన్నికల్లో అధికార కాంగ్రెస్ పార్టీకి బీఆర్‌ఎస్ గట్టి పోటీనిచ్చింది. బుధవారం మూడవ విడతలో భాగంగా 3,752 గ్రామ పంచాయతీలకు, 28,410 వార్డులకు పోలింగ్ జరిగింది. ఈ విడతలో సుమారు 53 లక్షల మంది ఓటర్లు తమ ఓటు హక్కు వినియోగించుకున్నారు. మధ్యాహ్నం 1 గంట ప్రాంతంలో పోలింగ్ ముగిసింది. 2 గంటల నుంచి ఓట్ల లెక్కింపు చేపట్టారు. రాష్ట్ర వ్యాప్తంగా గ్రామపంచాయతీ ఎన్నికలు చెదురుమదురు ఘటనలు మినహా ప్రశాంతంగా కొనసాగాయి. వికారాబాద్, రంగారెడ్డి జిల్లాల్లో స్వల్ప ఉద్రిక్తత నెలకొన్నది. పోలింగ్ బూత్‌లో ప్రచారం చేస్తున్నారంటూ కాంగ్రెస్, బీఆర్‌ఎస్ పార్టీలకు చెందిన పోలింగ్ ఏజెంట్లు పరస్పరం దాడులు చేసుకున్నారు. వికారాబాద్ జిల్లా పరిగి మండలం మాదారం పోలింగ్ కేంద్రం వద్ద బీఆర్‌ఎస్ పోలింగ్ ఏజెంట్లపై కాంగ్రెస్ పార్టీకి చెందినవారు దాడికి పాల్పడ్డారు. తమకు ఓట్లు వేయాలంటూ కాంగ్రెస్ ఏజెంట్లు పోలింగ్ బూత్‌లో ప్రచారం నిర్వహిస్తుండటంతో బీఆర్‌ఎస్ ఏజెంట్లు వారిని అడ్డుకున్నారు. దీంతో ఇరు వర్గాలు ఒకరిని ఒకరు తోసుకున్నారు. దీంతో నలుగురు గాయపడ్డారు. ఇరువర్గాలను చెదరగొట్టిన పోలీసులు.. గాయపడిన వారిని పరిగి ప్రభుత్వ దవాఖానకు తరలించారు. ఇక రంగారెడ్డి జిల్లా మంచాల మండలం అస్మత్‌పూర్‌లో ఉద్రిక్తత నెలకొన్నది. కాంగ్రెస్ అభ్యర్థి పోలింగ్ బూత్‌లో ప్రచారం నిర్వహిస్తున్నాడని బీఆర్‌ఎస్ నాయకులు ఆగ్రహం వ్యక్తం చేశారు. దీంతో బీఆర్‌ఎస్, కాంగ్రెస్ నాయకుల మధ్య ఘర్షణ చోటుచేసుకుంది. రెండు పార్టీల కార్యకర్తలు పరస్పరం దాడులు చేసుకున్నారు. దీంతో సర్పంచ్ అభ్యర్తి సహా పలువురు గాయపడ్డారు.పరిగి ఎమ్మెల్యే టీ. రామ్మోహన్ రెడ్డి ఏకంగా పోలింగ్ కేంద్రం వద్ద కుర్చీ వేసుకు కూర్చున్నారు. ఓటర్లను ప్రభావితం చేస్తున్నారు. ఎమ్మెల్యే రామ్మోహన్ రెడ్డి తన సొంత గ్రామం దోమ మండలంలోని శివారెడ్డిపల్లిలో ఓటు హక్కు వినియోగించుకున్నారు. అయితే మొదటి రెండు దశల ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేల స్వగ్రామాల్లో ఓటమిని ఎదురుచూశారు. అలా తనకు కూడా కావొద్దని అనుకున్నారో ఏమో.. ఏకంగా పోలింగ్ కేంద్రం వద్ద కుర్చి వేసుకుని కూర్చుకున్నారు. ఓటేయడానికి వెళ్లే వారిని కాంగ్రెస్ అభ్యర్థికి ఓటు వేయాలంటూ విజ్ఞప్తి చేసారు. ఎన్నికల నియమావలికి వ్యతిరేకంగా ఎమ్మెల్యే పోలింగ్ కేంద్రం వద్ద కూర్చున్నప్పటికీ అధికారులు పట్టించుకోవడం లేదని బీఆర్‌ఎస్ నాయకులు ఆగ్రహం వ్యక్తం చేసారు. సొంత ఊరిలో ఓడిపోతే పరువుపోతుందనే ఉద్దేశంతోనే ఆయన ఇలా వ్యవహరిస్తున్నారని విమర్శిస్తున్నారు.
ముథోల్‌లో భారీగా ఓటర్ల తరలిరాక
పంచాయతీ ఎన్నికల్లో స్థానిక ప్రజలు ఓటేసేందుకు భారీగా తరలి వచ్చారు. దీంతో గ్రామాల్లో పోలింగ్ 85శాతం వరకు చేరుకుంది. నిర్మల్ జిల్లా ముథోల్ పోలింగ్ కేంద్రంలో ఓటర్లు క్యూలైన్‌లో బారులు తీరి కనిపించారు. పోలింగ్ సమయం ముగిసినా క్యూలో ఉండడంతో వారికి ఓటేసేందుకు అధికారులు అనుమతించారు. మధ్యాహ్నం ఒంటి గంట లోపు పోలింగ్ కేంద్రానికి చేరుకున్న ఓటర్లకు సిబ్బంది టోకెన్లు అందజేశారు. దాదాపు 10 వేలకు పైగా ఓటర్లు కలిగిన ఈ పంచాయతీలో సర్పంచ్ పదవి కోసం 10 మంది అభ్యర్థులు పోటీ పడుతున్నారు. భారీ సంఖ్యలో ఉన్న ఓటర్లకు అనుగుణంగా పోలింగ్ కేంద్రాలను ఏర్పాటుచేయకపోవడంతో ఇబ్బందులు తలెత్తాయి. మొత్తం 16 వార్డులకు గాను ఒక్క వార్డు ఏకగ్రీవమైంది. మిగిలిన 15 వార్డులకు సరిపడేలా పోలింగ్ కేంద్రాలను ఏర్పాటుచేయలేదు. మరోవైపు ఈ 15 వార్డుల్లో 50 మంది అభ్యర్థుల వరకు పోటీలో ఉన్నారు. దీంతో ఓటు హక్కు వినియోగించుకునేందుకు వచ్చిన ఓటర్లంతా పోలింగ్ కేంద్రాల వద్ద బారులు తీరారు. ఓటు వేసే వారందరికీ ప్రవేశం, నిష్కమ్రణ ఒకే మార్గం కావడంతో రద్దీ పెరిగింది.
ఖమ్మంలో కాంగ్రెస్, బిఆర్‌ఎస్ వర్గాల ఘర్షణ
ఖమ్మం జిల్లా టేకులపల్లి మండలం బద్దుతండాలో కాంగ్రెస్, బీఆర్‌ఎస్ వర్గీయుల మధ్య ఘర్షణ చోటుచేసుకుంది. ఓ వ్యక్తి తొలుత గుర్తింపు కార్డు లేకుండా పోలింగ్ కేంద్రానికి వెళ్లాడు. ఓటేసేందుకు అధికారులు నిరాకరించడంతో వెనుదిరిగాడు. ఆ తర్వాత గుర్తింపు కార్డుతో మరోసారి అక్కడికి వచ్చాడు. ఈ క్రమంలో గమనించిన కాంగ్రెస్ అభ్యర్థి భూక్యా గంగారావు.. సదరు వ్యక్తి దొంగ ఓటు వేస్తున్నాడని ఆరోపిస్తూ ఆగ్రహానికి గురై అతడిపై చేయిచేసుకున్నాడు. దీంతో ఇరు పార్టీల కార్యకర్తల మధ్య జరిగిన వాగ్వాదం ఘర్షణకు దారి తీసింది. పోలీసులు అక్కడికి చేరుకుని ఇరు వర్గాలను చెదరగొట్టారు. టేకులపల్లి సీఐ బత్తుల సత్యనారాయణ, ఎస్సై రాజేందర్ ఆధ్వర్యంలో పోలీసులు పరిస్థితిని అదుపులోకి తీసుకొచ్చారు. నల్గొండ జిల్లా డిరడి మండలం శాంతిగూడెంలోనూ రెండు వర్గాల మధ్య ఘర్షణ జరిగింది. బీఆర్‌ఎస్, కాంగ్రెస్ కార్యకర్తలు పరస్పరం దాడి చేసుకున్నారు. ఈ ఘటనలో ఒకరికి గాయమైంది. అతడిని ఆస్పత్రికి తరలించారు. పోలీసులు అక్కడికి చేరుకుని ఇరువర్గాలను చెదరగొట్టారు. కరీంనగర్ జిల్లా జమ్మికుంట మండలం విలాసాగర్‌లో సర్పంచ్ అభ్యర్థి వద్ద పోలీసులు నగదు స్వాధీనం చేసుకన్నారు. స్థానిక పోలింగ్ కేంద్రం సవిూపంలో జనం గుమిగూడి ఉండటంతో పోలీసులు అక్కడికి వెళ్లారు. సర్పంచ్ అభ్యర్థి వద్ద రూ.28,500 నగదును స్వాధీనం చేసుకున్నారు.


