మూఢ విశ్వాసాలతోనే ఆత్మహత్య చేసుకున్నారా?

– 11మంది అనుమానాస్పద మృతిపై దర్యాప్తు వేగవంతంచేసిన పోలీసులు
– ఆరుగురు ఉరివేసుకోవడం వల్లే మృతి
– శరీరాలపై ఎలాంటి గాయాలు లేవని వెల్లడి
– పోస్టుమార్టం రిపోర్టు నివేదికల్లో వెల్లడి
న్యూఢిల్లీ, జులై2(జ‌నం సాక్షి ) : నగరంలోని బురారీ ప్రాంతలో 11 మంది అనుమానాస్పదంగా మృతి చెందిన ఘటనలో పోస్ట్‌ మార్టం నివేదిక వచ్చింది. ఈ నివేదిక ప్రకారం చనిపోయిన వారిలో ఆరుగురు ఉరి వేసుకోవడం వల్లే మరణించారని వెల్లడైంది. ఈ పదకొండు మందిలో పది మంది పైకప్పుకు వేలాడుతూ కనిపించగా, వృద్ధురాలి మృతదేహం నేలపై పడి ఉన్న సంగతి తెలిసిందే. అయితే ఈ మరణాలు ఎలా సంభవించాయనే అంశంపై పోలీసులు ఓ నిర్ధారణకు రాలేకపోతున్నారు. అందరూ సామూహికంగా ఆత్మహత్యకు పాల్పడ్డారా? లేదంటే ఎవరైనా అందరినీ చంపేసి ఉంటారా? అనే కోణంలో దర్యాప్తు చేస్తున్నారు. మృతులకు ఈరోజు దిల్లీలో అంత్యక్రియలు జరగనున్నాయి. పోలీసులకు వారి ఇంట్లో కొన్ని కీలక పత్రాలు లభ్యమయ్యాయి. మూఢ విశ్వాసాలతో మోక్షం కోసం వీరు చనిపోయినట్లు తెలుస్తోందని ఆ పత్రాలను పరిశీలించిన పోలీసులు వెల్లడించారు. పత్రాల్లో రాసి ఉన్నట్లుగా మృతదేహాల కళ్లకు గంతలు.. నోర్లు, చేతులు కట్టేసి ఉన్నాయని తెలిపారు. మానవ దేహం తాత్కాలికమని, కళ్లు, నోరు మూసుకోవడం ద్వారా భయాన్ని జయించవచ్చని ఓ ప్రతిలో రాసి ఉందని పోలీసులు తెలిపారు. దేవుడు తమను కాపాడతాడని వారు నమ్మినట్లుగా ఆ పత్రాల్లో ఉందని పోలీసులు చెబుతున్నారు. ఈ కుటుంబ సభ్యులు దేవుడిని బాగా నమ్ముతారని, రోజుకు మూడు సార్లు పూజలు చేస్తారని పొరుగున ఉన్న వారు చెబుతున్నారు. కాగా కొందరు బంధువులు మాత్రం వాళ్లు బాగా చదువుకున్న వాళ్లని.. అలాంటి మూఢ నమ్మకాలు నమ్మరని అంటున్నారు. దీంతో పోలీసులు అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తున్నారు.