మృత్యుంజయుడు ఆ యువకుడు..! – మానేరు నదిలో గల్లంతై ఈదుకుంటూ ఒడ్డుకు..
జనంసాక్షి , మంథని : పెద్దపల్లి జిల్లా మంథని మానేరు నదిలో గల్లంతయిన యువకుడు సురక్షితంగా బయటపడ్డాడు. మంథని మండలం గోపాలపురం ఇసుక రీచును చుట్టు ముట్టిన వరదల్లో ఒకరు గల్లంతు కాగా మరో 15 మంది వరకు చిక్కుకున్న సంగతితెలిసిందే. ఈ ఘటనలో గల్లంతయిన మధు ఈత కొట్టు కుంటూ చిన్న ఓదాల సమీపంలో ఒడ్డుకు చేరాడు. వరద ఉధృతిలో కొట్టుకపోయిన మథు చాకచక్యంగా వరద నీటిని తప్పించుకుంటూ కొద్ది దూరం వరకు ఈత కొట్టి సమీపంలోని చిన్న ఓదాల వద్ద సేఫ్ అయ్యాడు. అయితే గోపాలపురంఇసుక రీచు ఘటన గురించి సమాచారం అందుకున్న పెద్దపల్లి జడ్పీ ఛైర్మన్ పుట్ట మధు, గోదావరిఖని ఏసీపీ తుల శ్రీనివాస రావులు మానేరు పరివాహక ప్రాంతానికి చేరుకుని పర్యవేక్షిస్తుండగానే గల్లంతయిన మధు అక్కడ ప్రత్యక్ష్యం అయి అందరిని ఆశ్యర్యంలో ముంచెత్తాడు. ఉధృతంగా వెలుతున్న మానేరు నది ప్రవాహాంలో కూడా ధైర్యంగా ఈతకొట్టుకుంటూ ఒడ్డుకు చేరడం అందరిని ఆశ్యర్యంలో ముంచెత్తింది. ప్రాణాలతో బయటపడ్డ ఆ యువకుడిని ప్రతి ఒక్కరూ అభినందిస్తున్నారు.