ఐదుగురు పేకాట రాయుళ్ల అరెస్ట్

పాపన్నపేట, జనవరి 6 (జనంసాక్షి) :
రూ 26.183 నగదు స్వాధీనం
మెదక్ జిల్లా ఎస్పీ శ్రీనివాస రావు
మెదక్ జిల్లా పాపన్నపేట మండలం కొత్తలింగాయపల్లి గ్రామంలో పేకాట ఆడుతున్నారనే నమ్మదగిన సమాచారం మేరకు జిల్లా ఎస్పీ శ్రీనివాస రావు ఆదేశాల మేరకు టాస్క్ ఫోర్స్ పోలీసులు, పాపన్నపేట పోలీస్ సిబ్బంది కలిసి సోమవారం జూదం ఆడుతున్న ప్రదేశంలో ఆకస్మిక దాడులు నిర్వహించారు. ఈదాడిలో ఐదుగురు వ్యక్తులను అరెస్ట్ చేశారు. దాదిగారి కృష్ణగౌడ్,పుట్టిబాగయ్య,వగ్గుయాదయ్య,మెగావత్ కిషన్,నీరుడి లక్ష్మణ్,అదే విధంగా పేకాటలో పాల్గొని పరారైన వ్యక్తులు గుండమ్మ సాయిలు,పుట్టి బండాల సత్యనారాయణ,బెస్త వెంకటేశం,బుద్ధిసాయమ్మ,కర్రె సాయమ్మ సాయిలు,కోలా ధన్సింగ్ లని వెల్లడించారు. జూదం ఆడుతున్న ప్రదేశం నుండి మొత్తం రూ 26.183 నగదును స్వాధీనం చేసుకున్నారు. పట్టుబడిన నిందితులను సంబంధిత పోలీస్ స్టేషన్‌కు తరలించి వారి పై చట్టపరమైన చర్యలు చేపట్టడం జరుగుతున్నదని తెలిపారు. పరారైన నిందితులను త్వరలోనే పట్టుకుంటామని పేర్కొన్నారు. ఈసందర్భంగా జిల్లా ఎస్పీ మాట్లాడుతూ..జిల్లాలో చట్టవ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడే వారిని ఎట్టి పరిస్థితుల్లోనూ ఉపేక్షించేది లేదని,కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు.పేకాట, బెట్టింగ్ వంటి కార్యకలాపాల వలన ఎన్నో కుటుంబాలు నష్టపోతున్నాయని,ముఖ్యంగా యువత తక్కువ సమయంలో ఎక్కువ డబ్బు సంపాదించాలనే ఆలోచనలతో చెడు మార్గాలను ఎంచుకుంటున్నారని పేర్కొన్నారు. కష్టపడనీదే ఏదీ ఊరికే రాదన్నారు. ప్రజలు ఇలాంటి సమాచారాన్ని వెంటనే పోలీసులకు అందించి సహకరించాలని సూచించారు.

