సోయాబీన్ పంట కొనాలని ధర్నా

జనవరి 6(జనంసాక్షి) :రైతుల సమస్యలపై బీఆర్ఎస్ పోరాటం కొనసాగుతోంది. సోయాబీన్ పంటను కొనుగోలు చేయాలని డిమాండ్ చేస్తూ బీఆర్ఎస్ ఇచ్చిన పిలుపు మేరకు ఆదిలాబాద్ జిల్లాలో బంద్ కొనసాగుతోంది. ఈ బంద్‌కు అఖిలపక్ష రైతు, ప్రజా సంఘాల నేతలు, వ్యాపార సంస్థలు మద్దతు ప్రకటించాయి. ఈ నేపథ్యంలో మంగళవారం తెల్లవారుజామున ఆర్టీసీ డిపో ముందు మాజీ మంత్రి జోగు రామన్నతో పాటు బీఆర్ఎస్ కార్యకర్తలు ఆందోళన చేపట్టారు.
కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు స్పందించి సోయాబీన్ పంటను కొనుగోలు చేయాలని బీఆర్ఎస్ నాయకులు నినాదాలు చేశారు. ఈ క్రమంలో అక్కడకు వచ్చిన పోలీసులు వారిని అడ్డుకున్నారు. దీంతో పోలీసులు, బీఆర్ఎస్ నాయకుల మధ్య కాసేపు తోపులాట జరిగింది. కాగా, డిపో ముందు బస్సులను అడ్డుకున్న జోగు రామన్న, బీఆర్ఎస్ నాయకులను పోలీసులు అరెస్టు చేశారు. వారిని మావల పోలీస్ స్టేషన్‌కు తరలించారు.

