మెరిసిన ముంబయి
– పుణెపై ఐదు వికెట్ల
తేడాతో విజయం
– రాణించిన శర్మ
– ప్లే ఆఫ్‌కు మరింత చేరువ
పుణె, మే 11 (జనంసాక్షి) :
పుణెలో శనివారం జరిగిన మ్యాచ్‌లో పుణె వారియర్స్‌పై ముంబయి ఇండియన్స్ జట్టు 5 వికెట్ల తేడాతో విజయం సాధించింది. మొదట బ్యాటింగ్ చేసిన పుణె జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి 112 పరుగులు చేసింది. ఓపెనర్ బ్యాట్స్‌మెన్ ఉతప్ప 13 బంతుల్లో 11 పరుగులు మాత్రమే చేసి మలింగ బౌలింగ్‌లో ఎల్‌బీడబ్ల్యూగా ఔటయ్యాడు. ఫించ్ కూడా ఎక్కువ సేపు క్రీజ్‌లో నిలవలేక పోయాడు. 11 బంతుల్లో 10 పరుగులు చేసి జాన్సన్ బౌలింగ్‌లో స్మిత్‌కు క్యాచ్ ఇచ్చాడు. పాండే కొద్దిసేపు నిలకడగా ఆడి 29 బంతుల్లో 29 పరుగులు చేశాడు. మలింగ బౌలింగ్‌లో షాట్ కొట్టబోయి రాయుడికి క్యాచ్ ఇచ్చాడు. తర్వాత బ్యాటింగ్‌కు వచ్చిన యువరాజ్ సింగ్ 29 బంతులు ఆడి 33 పరుగులు చేశాడు. మాథ్యు ఎలాంటి పరుగులు చేయకుండానే వెనుదిరిగాల్సి వచ్చింది. నాయర్ 11, రిచర్డ్స్‌న్ 8, రసూల్ 4, కుమార్ 4 పరుగులు చేశారు. 113 పరుగుల లక్ష్యంతో బ్యాటింగ్‌కు దిగిన ముంబయి ఇండియన్స్ 5 వికెట్లు కోల్పోయి 116 పరుగులు చేసింది. శర్మ 37, రాయుడు 26, కార్తీక్ 16, టెండుల్కర్ 15, మాక్స్‌వెల్ 13 (నాటౌట్) పరుగులు చేసి విజయాన్ని అందించారు. దిండా 2, రిచర్డ్స్‌న్, మెండిస్, యువరాజ్‌సింగ్ తలో వికెట్ తీశారు.