మెరుగైన జీవితంలో హైదరాబాద్ ఫస్ట్
గ్లోబల్ మొబిలిటీ సంస్థ సర్వేలో మన రాజధాని బెస్ట్
వెనుకబడ్డ ఢిల్లీ, ముంబైలు, పుణె సెకండ్
ట్రావెలర్ మేగజిన్‌లో ప్రపంచంలోనే సెకండ్
నేడు దేశంలో టాప్ సిటీ
న్యూఢిల్లీ, మార్చి4(జనంసాక్షి): విశ్వనగరంగా అభివృద్ధి చెందుతున్న హైదరాబాద్ నగరానికి మరో అరుదైన గుర్తింపు లభించింది. మెరుగైన జీవనం విషయంలో దేశంలోని ప్రముఖ నగరాలు దిల్లీ,బెంగళూరు,ముంబై,చెన్నై,కోల్‌కతా నగరాలను వెనక్కు నెట్టి హైదరాబాద్ మొదటిస్థానంలో నిలిచింది. మెరుగైన జీవనం విషయంలో భారతదేశంలోనే హైదరాబాద్ ది బెస్ట్ సిటీగా నిలిచిందని గ్లోబల్ మొబిలిటీ సంస్థ విడుదల చేసిన క్వాలిటీ ఆప్ లివింగ్ రిపోర్టులో పేర్కొంది. ప్రపంచస్థాయి వసతులు,జీవన ప్రమాణాల ఆధారంగా గ్లోబల్ మొబిలీటీ సంస్థ చేపట్టిన సర్వేలో హైదరాబాద్ మొదటి స్థానంలో నిలువగా..పుణే రెండవ స్థానంలో నిలిచింది. పెరిగిన జనాభా, వాతావరణ కాలుష్యం కారణంగా దేశ రాజధాని ఢిల్లీ, ఆర్థిక రాజధాని నగరం ముంబైలు వెనుకబడుతున్నాయని నివేదికలో వెల్లడించింది. హైదరాబాద్ నగరంలో ఇంటర్నేషనల్ స్కూల్స్, ఇంగ్లీష్ బోధించే అత్యుత్తమమైన పాఠశాలలుండటంతో పాటు రాజీవ్‌గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం, మంచి రోడ్లు, అనువైన వాతావరణం, తక్కువ కాలుష్యం వంటి అనుకూల అంశాలు కలిగి ఉండటంతో ఇండియాలోనే అగ్రస్థానంలో నిలిచిందని పేర్కొంది.
ఇటీవలే నేషనల్ జాగ్రఫీ ట్రావెలర్ మేగజిన్ కూడా ప్రపంచంలోని టాప్ సిటీల లిస్ట్‌లో హైదరాబాద్ టాప్ 2 అంటూ దండోరా వేసింది. హైదరాబాద్ అమ్ములపొదిలో ఇలాంటి కీర్తి కిరీటాలు గడిచిన చరిత్రలో హైదరాబాద్ ఒడి చేరిన సందర్భాలెన్నో. హైదరాబాద్ షాన్ గురించి ఎంత చెప్పినా తక్కువే. 400 యేళ్ల పైబడిన ఘనచరిత్ర ఈ నగరం సొంతం. 1591లో కులీకుతుబ్ షా పాలనలో పురుడు పోసుకున్న హైదరాబాద్ తదనంతరం వందేళ్లకుపైగా నిజాంల పాలనలో అంచెలంచెలుగా విస్తరించింది. మీర్ ఉస్మాన్ ఆలీఖాన్ లాంటి ప్రపంచంలోనే అత్యంత ధని నవాబులేలిన ఘనమైన చారిత్రక నేపథ్యం హైదరాబాద్ మహానగరానిది, నాటి చారిత్రక కట్టడాల నుండి నేటి ఐటీ హబ్స్ వరకు భాగ్యనగరం దినదిన ప్రవర్తమానంగా వెలుగొందుతూనే ఉంది. అందుకే హైదరాబాద్ నగరం అంటే బంగారు నగరం అంటున్నది ప్రపంచ ప్రఖ్యాత నేషనల్ జాగ్రఫిక్ ట్రావెలర్ మేగజిన్. ఈ మేగజిన్ వార్షిక గైడ్‌లో.. 2015లో చూడాల్సిన ప్రపంచంలోని 20 అత్యంత ప్రసిద్ధ నగరాల పేర్లను ప్రచురించింది. ఈ మేగజిన్ రిపోర్ట్ ప్రకారం హైదరాబాద్ ప్రపంచంలోనే చూడదగ్గ ప్రదేశాల్లో రెరడో అత్యంత ప్రసిద్ధిచెందిన మంచి నగరంగా కీర్తి గడించింది. మేగజిన్ డిసెంబర్2014-జనవరి 2015 ఎడిషన్‌లో హైదరాబాద్ రెండో స్థానంలో నిలిచింది, అంతేకాక.. హైదరాబాద్ ప్రపంచ ప్రఖ్యాత ఐటీ కంపెనీలకు అడ్డాగా మారిన కమ్రాన్ని, సంపన్నమైన తాజ్ ఫలక్‌నమా పాలెస్ మొదలు గల్లీల్లోని ఇరానీ కేఫ్‌ల వరకు, ముత్యాల నుండి గాజుల వ్యాపారుల దాకా, ఇలా ఇంకెన్నో హైదరాబాద్‌కు సంబంధించిన ప్రత్యేకలను వివరించింది. నిజమే మరి హైదరాబాద్‌కు ఏం తక్కువ? తరగని వారసత్వ సంపద భాగ్యనగరం సొంతం, హైదరాబాద్‌లో చారితక్ర చిహ్నాలుగా నిలుస్తున్న చార్మినార్, గోల్కొండ కోటలకు ఎంతటి ఘన చరిత్ర ఉందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఇవేకాక ఇంకెన్నో చారిత్రక ఆనవాళ్లు, మ్యూజియంలు, చెరువులు, ఉద్యానవనాలు ఇక్కడున్నాయి.
గత వలస పాలనలో అవన్నీ నిర్లక్ష్యానికి గురి కాకుంటే, వాటిని టూరిజం స్పాట్లుగా మలిచి ఉంటే ఇంకెంతో వృద్ధి చెందేది. మరీ ముఖ్యంగా ఇక్కడి వంటకాలు ఇలా ఎన్నో ప్రత్యేకతలున్న మహానగరం హైదరాబాద్. ఇక్కడి వంటకాలైన హైదరాబాదీ బిర్యానీ, హలీంలు పప్రంచఖ్యాతి గడించిన సంగతి తెలిసిందే. హైదరాబాద్‌కు వస్తే బిర్యానీ తినకుండా తిరిగి వెళ్లే వారుండరు. రంజాన్ సీజన్‌లో చేసే హలీం ఖండాంతరాలకు ఎక్స్‌పోర్ట్ అవుతుంది. శతాబ్దాలుగా నెలకొన్న ఇక్కడి ఓల్డ్‌సిటీ షాపింగ్ బజార్లు , నుమాయిష్‌లు ఇక్కడి వందల యేండ్ల సంస్కృతీ సాంప్రదాయాలకు నిలువెత్లు నిదర్శనాలు.
కాలానికి తగ్గట్లుగా హైదరాబాద్ కూడా కొత్తపుంతలు తొక్కుతూనే ఉంది. ఆధునిక నగరానికి ఉండాల్సిన అన్ని హంగులూ హైదరాబాద్‌లో ఉన్నాయి. అంతర్జాతీయ స్ధాయి ఎయిర్‌పోర్టు, స్కూళ్లు, ఉన్నత విద్యా సంస్థలు, షాపింగ్ మాల్స్, రిక్రియేషన్ సెంటర్లు, రిసార్టులు, క్లబ్బులు, పబ్బులు ఇలా ప్రపంచ స్థాయి మహానగరానికి ఉండాల్సిన అన్ని సొబగులు మననగరానికి ఉన్నాయి. ఇవేకాదు ఇక్కడ ప్రపంచ ప్రఖ్యాత ఐటీ కంపెనీలన్ని తమ పునాదులు నిర్మిస్తున్నాయి. ఒక్క ఐటీ కంపెనీలే కాక ఎన్నో మల్టీ నేషనల్ కంపెనీలు, ఇండస్ట్రీలు హైదరాబాద్ వైపు చూస్తున్నాయి. ఇందుకు కారణం ఇక్కడి అనువైన వాతావరణం. ఇది ఒకటైతే.. ప్రపంచస్థాయి పారిశ్రామికవేత్తలను ఆకర్షించటానికి అనుకూలమైన పాలసీలు తెస్తున్న ప్రస్థుత ప్రభుత్వ చిత్తశుద్ది కూడా మరో కారణం. వలసాంధ్ర పాలనలో భూ దోపిడీయే కాక, రకరకాలుగా దోపిడీకి గురైన హైదరాబాద్ మహానగరం సీఎం కేసీయార్ ముందుచూపుతో మరింత ఉత్సాహంగా అభివృద్ధి చెందుతోంది. నగరానికి తలమానికమైన హుస్సేన్‌సాగర్ చెరువు పారిశుద్యం పనులు శరవేగంగా సాగుతున్నాయి. ఇలా ఎన్నో ధ్వంసమైన హైదరాబాద్ సంపదలు స్వ రాష్ట్ర పాలనలో తిరిగి జీవం పోసుకుంటున్నాయి. దీనికి హైదరాబాద్‌లో ఉండే ప్రకృతి కూడా వరంగా లభించింది. 365 రోజుల్లో ఓ రెండు నెలలపాటు ఎండలను కాస్తే మిగతా 300 రోజులు అహ్లాదకర వాతావరణం కేపలం హైకరాబాద్‌కే సొంతం.