మేమే ప్రభుత్వాన్ని ఏర్పాటుచేయొచ్చు!

– జేడీఎస్‌ అధినేత దేవెగౌడ్‌
– ¬లెనారసిపురలో ఓటు హక్కు వినియోగించుకున్న దేవెగౌడ
బెంగళూరు, మే12(జ‌నం సాక్షి ) : కర్ణాటక ఎన్నికల్లో జేడీఎస్‌ ప్రభుత్వాన్ని ఏర్పాటుచేసే అవకాశముందని ఆ పార్టీ అధినేత, మాజీ ప్రధానమంత్రి దేవెగౌడ ఆశాభావం వ్యక్తం చేశారు. కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో భాగంగా హసన్‌ జిల్లా ¬లెనారసిపురలో ఏర్పాటుచేసిన పోలింగ్‌ కేంద్రంలో దేవెగౌడ శనివారం తన ఓటు హక్కు వినియోగించుకున్నారు. ఆయనతోపాటు తన సతీమణి చెన్నమ్మ దేవెగౌడ, కుమారుడు రేవన్న కుటుంబసభ్యులు కూడా ఓటు వేశారు. అనంతరం ఆయన విలేకరులతో మాట్లాడారు. తాజా ఎన్నికల్లో జేడీఎస్‌ బాగా పనిచేసిందని, చక్కగా ప్రచారం నిర్వహించిందని దేవెగౌడ పేర్కొన్నారు. తమ పార్టీ ప్రభుత్వాన్ని ఏర్పాటుచేసే అవకాశముందని చెప్పారు. ఇప్పటికే కాంగ్రెస్‌, బీజేపీలపై కన్నడ ప్రజలు తీవ్ర
ఆగ్రహంతో ఉన్నారని, అది ఖచ్చితంగా జేడీఎస్‌కు మేలు చేస్తుందన్నారు. మహిళలు, యువత, అన్నదాత ఇలా అన్ని వర్గాల ప్రజలు జేడీఎస్‌కు పట్టం కడితేనే మేలు జరుగుతుందని భావిస్తున్నారని అన్నారు. కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో ఏ పార్టీకి స్పష్టమైన మెజారిటీ రాకపోతే.. జేడీఎస్‌ కింగ్‌మేకర్‌ అయ్యే అవకాశముందని సర్వేలు అంచనా వేసిన సంగతి తెలిసిందే.