మే నెలాఖరుకు జైపూర్‌ విద్యుత్‌

ఆదిలాబాద్‌,ఏప్రిల్‌2(జ‌నంసాక్షి): ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఇచ్చిన హావిూ మేరకు మే నెలకల్లా 1200 మెగావాట్ల విద్యుత్తును రాష్టాన్రికి కి అందించేందుకు తాము కృషి చేస్తున్నామని ఎస్టీపీపీ ఎగ్జిక్యూటివ్‌ డైరెక్టర్‌  సంజయ్‌కుమార్‌ సూర్‌ అన్నారు. సమష్టి కృషితోనే సింగరేణి సంస్థ  నిర్దేశించిన 60 మిలియన్ల టన్నుల బొగ్గు ఉత్పత్తి లక్ష్యాన్ని సాధించిందని అన్నారు.  సింగరేణికి బంగారు భవిష్యత్తు ఉందని అన్నారు. బొగ్గు ఉత్పత్తిలో ఇదే ఒరవడితో రానున్న ఏడాదిలో సైతం లక్ష్యాలను సాధించాలని ఆకాంక్షించారు. గతేడాది కంటే 15 శాతం వృద్ధి సాధించడం గొప్ప విషయమన్నారు. త్వరలోనే సింగరేణి విద్యుత్తు ఉత్పత్తి చేయనుందన్నారు. 60 మిలియన్‌ టన్నుల బొగ్గు ఉత్పత్తి సాధించడం దేశచరిత్రలోనే గొప్ప రికార్డున్నారు. అదేవిధంగా బొగ్గు సరఫరాలోనూ 11 శాతం వృద్ధి సాధించిందన్నారు. సింగరేణి బొగ్గు ఉత్పత్తితో పాటు విద్యుత్తు రంగంలోకి అడుగుపెట్టడం హర్షణీయమన్నారు. ఇదిలావుంటే సింగరేణి సంస్థ మనుగడ, కార్మికుల సంక్షేమం కోసం తమ సంఘం ‘సేవ్‌ సింగరేణి- సేవ్‌ వర్కర్‌’ పేరుతో కలిసి వచ్చే సంఘాలతో కలిసి ఉద్యమించనున్నట్లు ఐఎన్టీయూసీ అనుబంధ సింగరేణి స్టాఫ్‌ అండ్‌ వర్కర్స్‌ యూనియన్‌  ప్రధాన కార్యదర్శి బి.జనక్‌ప్రసాద్‌ అన్నారు. 60.03 మిలియన్‌ టన్నుల బొగ్గు ఉత్పత్తి సాధించడానికి కృషి చేసిన కార్మికులు, అధికారులు, సూపర్‌వైజర్లకు తమ సంఘం తరఫున శుభాకాంక్షలు తెలుపుతున్నామన్నారు. సింగరేణి సంస్థ రూ.2200 కోట్ల లాభాలను ఆర్జించే వీలుందని, అందులో రూ.800 కోట్లు ఆదాయపు పన్ను రూపంలో చెల్లింపులు జరిగితే మిగిలిన రూ.1400 కోట్ల లాభాలపై కార్మికులకు 25 శాతం వాటాను చెల్లించాలని డిమాండ్‌ చేశారు.  రికార్డు స్థాయిలో సాధించిన బొగ్గు ఉత్పత్తి గుర్తుండిపోయేలా ప్రతి కార్మికుడికి 10 గ్రాముల బంగారు నాణాన్ని అందించాలని  డిమాండ్‌ చేశారు.  దీర్ఘకాలిక ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకొని ప్రణాళికాబద్ధంగా నిరుద్యోగులకు ఉపాధి కల్పించేలా చర్యలు తీసుకోవాలన్నారు. సింగరేణి గుర్తింపు సంఘం తెబొగకాసం, తెరాస నేతలు ఎన్నిక సమయంలో ఇచ్చిన వాగ్దానాలను నెరవేర్చడంలో విఫలమయ్యారని ఆరోపించారు.