మైనార్టీలపై చంద్రబాబు మొసలి కన్నీరు

 

అధికారంలో ఉండగా వారిని పట్టించుకోని బాబు

కులాలు, వర్గాల మధ్యచిచ్చు పెట్టడమే లక్ష్యం: కొడాలి నాని

అమరావతి,నవంబర్‌11( జనం సాక్షి ):అధికారంలో ఉన్న సమయంలో మైనార్టీలను ఆదుకోని చంద్రబాబు ఇప్పుడు ఈ ఘటనపై ముసలి కన్నీరు కారుస్తున్నారని పౌరసరఫరాల శాఖ మంత్రి కొడాలి నాని ఆగ్రహం వ్యక్తం చేశారు. నీచ రాజకీయాలకు పాల్పడుతున్న చంద్రబాబు, జూమ్‌ యాప్‌ ద్వారా సీఎం జగన్‌పై తప్పుడు ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. ప్రతిపక్ష నేత చంద్రబాబునాయుడు మతాలు, కులాల గురించి ఎంత తక్కువ మాట్లాడితే అంత మంచిదని కొడాలి నాని హితవు పలికారు. ప్రభుత్వం గురించి అవాస్తవాలు ప్రచారం చేస్తే తగిన శాస్తి చేస్తామని హెచ్చరించారు. ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఎన్నడూ కులాలను, మతాలను అడ్డుపెట్టుకోరని, చంద్రబాబులా అధికారం కోసం మనుషుల మధ్య చిచ్చుపెట్టాలని చూడలేదంటూ చురకలు అంటించారు. నంద్యాల షేక్‌ అబ్దుల్‌ సలాం ఆత్మహత్య ఘటనను రాజకీయం చేస్తూ, ప్రభుత్వంపై బురద జల్లుతున్న చంద్రబాబును చూస్తుంటే పిచ్చివాడు గుర్తుకు వస్తున్నాడంటూ ధ్వజమెత్తారు. నంద్యాల ఘటనపై విచారం వ్యక్తం చేసిన సీఎం జగన్‌, సామూహిక ఆత్మహత్యకు బాధ్యులైన వారిపై తక్షణమే చర్యలు తీసుకోవాలని ఆదేశిస్తే, టీడీపీకి చెందిన రామచంద్రరావు మాత్రం నిందితులకు బెయిలు ఇప్పించారంటూ మండిపడ్డారు. ప్రజలు టీడీపీని 23 సీట్లకే పరిమితం చేసినా చంద్రబాబుకు బుద్ధిరాలేదని కొడాలి నాని ఎద్దేవా చేశారు. పేదలకు ఇళ్ల స్థలాల పట్టాలు ఇవ్వాలన్న ప్రభుత్వ సంకల్పానికి మోకాలడ్డుతున్న చంద్రబాబు తీరుపై కొడాలి నాని తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. టిడ్కోలో 13 లక్షల ఇల్లు ఎక్కడ కట్టించారో చంద్రబాబు చూపించాలని డిమాండ్‌ చేశారు. డెబ్బై ఏళ్లు వచ్చినా అబద్దాలు చెప్పే అలవాటు మానుకోవడం లేదంటూ ఆయనపై మండిపడ్డారు. ఇళ్ల కోసం కేంద్రం నుంచి తెచ్చిన సబ్సిడీని కాంట్రాక్టర్లకు కట్టబెట్టిన ఘనత బాబుకే చెల్లుతుంది. ఇక కట్టిన 2లక్షల ఇళ్లకు కనీసం వసతులు కల్పించలేదు. 30 లక్షల ఇళ్ల పట్టాలు ఇస్తామంటే వాటిని అడ్డుకోవడానికి కోర్టుల్లో కేసులు వేయిస్తున్నాడు. సంక్రాంతికి టిడ్కో ఇళ్లను ప్రజలకు ఎలా అప్పగిస్తారు. పేదల అవసరాలను కూడా రాజకీయాల కోసం వాడుకుంటారా అని చంద్రబాబు, టీడీపీ నేతల తీరును ఎండగట్టారు. కోట్లు ఖర్చు పెట్టి ఇళ్ల స్థలాలు ఇవ్వకుండా ప్రభుత్వానికి అడ్డుపడుతున్నారు. కోర్టుల్లో వేసిన స్టేను చంద్రబాబు వెకేట్‌ చేస్తే డిసెంబర్‌ 21 సీఎం జగన్‌ పుట్టిన రోజున టిడ్కో ఇళ్లు, ఇళ్ల స్థలాల పట్టాలను పంపిణీ చేస్తాం. చంద్రబాబుకు విజ్ఞప్తి చేస్తున్నాం. 25 కోట్లు ఖర్చు పెట్టి 30 లక్షల మంది ఇళ్ల స్థలాలను కోర్టుల ద్వారా అడ్డుకోవద్దు. ఇప్పటికైనా కేసులను ఉపసంహరణ చేసుకోవాల్సిందిగా చంద్రబాబును కోరుతున్నాం. ఇళ్ల పట్టాల కేసుల విషయంలో చంద్రబాబు నిర్ణయం మార్చుకోక పోతే టిడ్కో ఇళ్ల ముందే నేను ఆందోళన చేపడతానని కొడాలి నాని హెచ్చరించారు.