మైనార్టీల అభివృద్ధి.. మైనార్టీల అభివృద్ధి..  కేసీఆర్‌తోనే సాధ్యం


– 12శాతం రిజర్వేషన్లు కల్పించి తీరుతాం
– టీఆర్‌ఎస్‌ ఎట్టి పరిస్థితుల్లోనూ బీజేపీతో కలవదు
– మాజీ డిప్యూటీ సీఎం మహమూద్‌ అలీ
నిజామాబాద్‌, నవంబర్‌10(జ‌నంసాక్షి) : మైనార్టీల అభివృద్ధి కేసీఆర్‌తోనే సాధ్యమని, ఆ మేరకు నాలుగేళ్లలో కృషి చేశామని, రానున్న కాలంలోనూ అభివృద్ధిని కొనసాగిస్తామని మాజీ డిప్యూటీ సీఎం, టీఆర్‌ఎస్‌ నేత మహమూద్‌ అలీ అన్నారు. నిజామాబాద్‌లో ఎన్నికల ప్రచారానికి వచ్చిన మహమూద్‌ అలీ విలేకరులతో మాట్లాడారు. దేశంలో లౌకిక పార్టీ ఏదన్నా ఉందంటే అది టీఆర్‌ఎస్‌ మాత్రమేనని అన్నారు. తెలంగాణ కోసం 29పార్టీల మద్ధతు కూడగట్టిన ఘనత కేసీఆర్‌దేనన్నారు. కాంగ్రెస్‌, టీడీపీ హయాంలో మైనార్టీ సంక్షేమాన్ని విస్మరించారని తీవ్రంగా విమర్శించారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడితే విద్యుత్‌ కష్టాలు తప్పవని చెప్పిన అప్పటి సీఎం కిరణ్‌ కుమార్‌ రెడ్డి మాటలు తప్పు అని నిరూపించామని అన్నారు. తెలంగాణాను విద్యుత్‌ మిగులు రాష్ట్రంగా మార్చిన ఘనత ముమ్మాటికీ కేసీఆర్‌దేనని అన్నారు. టీఆర్‌ఎస్‌ పార్టీ ఎట్టి పరిస్థితుల్లో బీజేపీతో కలవదని స్పష్టం చేశారు. దేశంలో అభివృద్ధి చెందుతున్న రాష్ట్రంగా తెలంగాణ ఉందని మహమూద్‌ అలీ అన్నారు. ముస్లిం రిజర్వేషన్ల పెంపు కోసం కేసీఆర్‌ కట్టుబడి ఉన్నారని, దీనిపై టీఆర్‌ఎస్‌ ఎంపీలు 12రోజుల పాటు పార్లమెంటులో పోరాటం కూడా చేశారని గుర్తు చేశారు. తెలంగాణలో మైనారిటీల కోసం అనేక సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టారని ఆయన చెప్పారు. షాదీ ముబారక్‌లో భాగంగా 604 కోట్ల రూపాయిలు ఖర్చు చేశామన్నారు. రాష్ట్రంలో ముస్లిం విద్యకోసం 204 మైనార్టీ గురుకులాలు ఏర్పాటు చేశామని తెలిపారు. గురుకులాల ద్వారా అత్యున్నత విద్యను అందిస్తున్నామని అన్నారు. షాదీముబారక్‌ ద్వారా ఆడబిడ్డల పెళ్లికి లక్షా 116 ఇస్తున్నామని మహమూద్‌ అలీ తెలిపారు. ఎన్నికల మేనిఫెస్టోలో పెట్టని హావిూలు కూడా సీఎం కేసీఆర్‌ అమలు చేశారన్నారు. ప్రతివర్గానికి సంక్షేమ పథకాలు అందేలా సీఎం కేసీఆర్‌ సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టారన్నారు. కాంగ్రెస్‌, టీడీపీ అభ్యర్థులకు డిపాజిట్లు కూడా దక్కవని, ఎన్నారైల కోసం సీఎం కేసీఆర్‌ చిత్తశుద్ధితో పనిచేస్తున్నారన్నారు. దేశంలోనే అత్యుత్తమ ముఖ్యమంత్రి కేసీఆర్‌ అని కొనియాడారు.