మొగోళ్ళ నీడలోనే ఆడోళ్ళ అధికారం… ఇంకెన్నాళ్లు?!
– ప్రజాప్రతినిధులుగా మహిళలు ఉన్నప్పటికీ చాలాచోట్ల పురుషులదే ఆధిపత్యం
– మహిళా ప్రజాప్రతినిధులు స్వేచ్ఛగా విధులు నిర్వహిస్తున్న దగ్గర అవినీతి, అక్రమాల ఆరోపణలు దూరం
– విద్య, వైద్యం, విద్యుత్, రక్షణ రంగాల్లో సైతం సమర్థవంతంగా విధులు నిర్వహిస్తున్న మహిళామణులు
హైదరాబాద్ డిసెంబరు 30 (జనంసాక్షి):మహిళలు వంటింటికే పరిమితం కాకుండా అన్ని రంగాల్లో తమ సామర్థ్యాన్ని నిరూపించుకుంటూ స్వావలంభనతో పాటు సాధికారత సాధించాలనే లక్ష్యంతో ఎన్ని చట్టాలు వచ్చినా క్షేత్రస్థాయిలో అనుకున్న ఫలితాలు రావడం లేదు. క్లిష్టమైన వైద్యం, విద్యుత్, రక్షణ వంటి రంగాల్లో సైతం మహిళలు సమర్థవంతంగా విధులు నిర్వహిస్తున్నారు. వాళ్ళు స్వేచ్ఛగా విధులు నిర్వహిస్తున్న దగ్గర అవినీతి, అక్రమాల ఆరోపణలు తక్కువ రావడంతో పాటు ప్రజలు, అధికారుల మన్ననలు పొందటంలో ముందుంటారు. కానీ ప్రజాక్షేత్రంలో విజయం సాధించి ప్రజాప్రతినిధులుగా ఎన్నికైన మహిళా నాయకురాళ్లు చాలాచోట్ల ప్రేక్షకపాత్ర పోషిస్తున్నారు. స్వేచ్ఛగా విధులు నిర్వహిస్తూ ప్రజలకు సేవలందించాల్సిన మహిళా ప్రజాప్రతినిధులు అధికారాన్ని వాళ్ళ కుటుంబసభ్యులకు అప్పగిస్తున్నారు. మహిళా ప్రజాప్రతినిధుల కుటుంబసభ్యులు అధికారులపై అజమాయిషీ చెలాయిస్తూ సాధారణ ప్రజలను సైతం ఇబ్బంది పెడుతున్నారు. అధికారిక కార్యక్రమాల్లో దర్జాగా పాల్గొనడమే కాకుండా కొన్నిచోట్ల ఏకంగా వారి కార్యాలయ సీట్లలో కూడా కూర్చుంటున్నారు. ఇలాంటి ఘటనల ద్వారా మహిళల సాధికారత కోసం తీసుకొచ్చిన చట్టాల లక్ష్యం నెరవేరడం లేదు. మహిళా ప్రజాప్రతినిధులు ఉన్నదగ్గర వారి కుటుంబసభ్యుల ఆధిపత్యం తగ్గాలంటే ముందుగా చట్టాలపట్ల అవగాహన కల్పించాలి. మహిళా ప్రజాప్రతినిధులు తమకు ఉన్న హక్కులు, బాధ్యతలు గుర్తించి అధికారాన్ని కుటుంబసభ్యులకు అప్పగించకుండా తామే ప్రజాసేవకు వినియోగిస్తే సమాజంలో వచ్చే గుర్తింపును గ్రహించాలి. అధికారిక విధుల నిర్వహణలో మహిళా ప్రజాప్రతినిధుల కుటుంబసభ్యుల జోక్యాన్ని అధికారులు ఏ మాత్రం సహించకూడదు. మహిళా ప్రజాప్రతినిధులు రాజ్యాంగబద్దంగా, స్వేచ్ఛగా విధులు నిర్వహించేందుకు అధికారులతో పాటు అన్నిస్థాయిల ప్రజాప్రతినిధులు చర్యలు తీసుకోవాలి. అప్పుడే మహిళా సాధికారతకు మోక్షం.