మోడీకి మనోబలాన్ని ఇచ్చిన గుజరాత్‌ నివేదిక

గోద్రా అల్లర్లలో ప్రమేయం లేదన్న నానవతి కమిషన్‌ నివేదిక

కుట్రలతో చేసిన ఆరోపణలకు ఇక చెల్లుచీటి

న్యూఢిల్లీ,డిసెంబర్‌12(జ‌నంసాక్షి): గుజరాత్‌లో సబర్మతి ఎక్స్‌ప్రెస్‌ బోగీని తగులబెట్టిన ఘటనలో కరసేవకులు మాడి మసయ్యారు. ఈ ఘటన దేశవ్యాప్తంగానే కాకుండా ప్రపంచ వ్యాప్తంగా కలచివేసింది. దీంతో ఆనాడు గుజరాత్‌లో ప్రజలు సహజంగానే ఆందోళనకు దిగారు. ఘటనను తట్టుకోలేక పోయారు. దీంతో కొందరు రెచ్చిపోయిమారణకాండకు దిగారు. ఈ అనివార్య ఘటనలో కొందరు మరణించారు. ఇదంతా ఆనాటి సిఎంగా ఉన్న మోడీ ఆదేశాల మేరకే జరిగిందన్న ప్రచారం జరిగింది. సహజంగానే దీనిపై విపక్షాలు మోడీపై విరుచుకుపడ్డాయి. సబర్మతీ ఎక్స్‌ప్రెస్‌ ఘటనకు సంబంధించిన నివేదిక తొలిభాగం 2009లోనే వెలువడింది. తదనంతర మారణకాండకు సంబంధించిన రెండవభాగం శ్రీకుమార్‌ హైకోర్టులో కేసు వేసిన నేపథ్యంలో విడుదలైంది. కమిషన్‌ నిర్థారణలను అటుంచితే, కరసేవకుల సజీవదహనానికి హిందువులను ప్రతీకారం తీర్చుకోనివ్వవలసిందిగా ముఖ్యమంత్రి నరేంద్రమోదీ ఆదేశాలున్నందున తదనుగుణంగా వ్యవహరించమంటూ అప్పటి డీజీపీ పోలీసులను ఆదేశించారని శ్రీకుమార్‌ కమిషన్‌కు తెలియచేశారు. మంత్రులు, పోలీసు ఉన్నతాధికారులు, ఇతర పెద్దలు ఊచకోతలు యథేచ్ఛగా సాగేట్టు ఇచ్చిన ఆదేశాల మొబైల్‌ ఫోన్‌ రికార్డులను రాహుల్‌ శర్మ సమర్పించారు. అయితే అదంతా కట్టుకథ అని తదనంతర విచారాణలో తేలింది. తాజాగా నానావతి కమిషన్‌ నివేదిక కూడా దీనిని సమర్థించింది. ఈ మేరకునివేదికను సమర్పించింది. దేశవ్యాప్త ఎన్నార్సీ, పౌరసత్వ సవరణ బిల్లు,ఇటీవల 370 రద్దు వంటి చారిత్రాత్మక నిర్ణయాలు తీసుకున్న దశలో గుజరాత్‌ ప్రభుత్వం ఐదేళ్ళక్రితం నాటి నానావతి కమిషన్‌ నివేదికను అసెంబ్లీలో ప్రవేశపెట్టడం, అందులో మోడీకి క్లీన్‌ చిట్‌ దక్కడం హర్షణీయం. కుట్రలతో మోడీని

తక్కువ చేసి చూపాలన్న కుహనా లౌకిక వాదులకు ఇదో చెంపపెట్టు. గుజరాత్‌ ఊచకోతల నిందనుంచి మోడీ బయటపడం అభినందనీయం. అడ్డగోలు అబద్దాలతో మోదీ ప్రతిష్ఠను దెబ్బతీసేందుకు స్వచ్ఛంద సంస్థలు, విదేశీశక్తులు కుట్రపన్నాయన్న బీజేపీ నాయకుల వాదనకు మరింత బలం చేకూరింది. .

మోదీ మాత్రమే కాదు, ఆయన మంత్రివర్గ సహచరుల్లో ఒక్కరు కూడా ఈ ఊచకోతలకు కుట్రపన్నినట్టుగా, ప్రోత్సహించినట్టుగా, దిశానిర్దేశర చేసినట్టుగా ఆధారాలు లేవని కమిషన్‌ తేల్చేసింది. పదిహేనువందల పేజీల నివేదికలో ప్రధానంగా పోలీసులనే తప్పుబడుతూ, పోలీసులు బాధ్యతగా వ్యవహరించలేదనీ, సంఖ్య తక్కువైనందునో, ఆయుధబలంలేనందునో మారణకాండను నిలువరించలేకపోయారని ప్రకటించింది. ఊచకోతల వెనుక రాష్ట్రప్రభుత్వ హస్తం ఉన్నదంటూ అప్పట్లో కీలకస్థానాల్లో ఉన్న ముగ్గురు ఐపీఎస్‌ అధికారులు ఆర్‌.బి. శ్రీకుమార్‌, రాహుల్‌ శర్మ, సంజీవ్‌ భట్‌లు సమర్పించిన సాక్ష్యాలు, ఆధారాలను తోసిపుచ్చడమే కాక వారి విశ్వసనీయతనే ప్రశ్నించింది. దనపు డీజీపీగా ఉన్న శ్రీకుమార్‌, అహ్మదాబాద్‌ డిప్యూటీ కమిషనర్‌గా ఉన్న శర్మ, ఇంటెలిజెన్స్‌ విభాగంలో ఉన్న భట్‌ సమర్పించిన సీడీలు, ఫ్యాక్స్‌లు, ఆడియో రికార్డులు విశ్వసించదగినవి కావనీ, వాటిలో అనేకం నకిలీవని కమిషన్‌ పేర్కొన్నది. మొత్తంగా గోద్రా అల్లర్లు అంతా బూటకమని తేలింది. అలాగే మోడీపై కావాలని పన్నిన కుట్రలు చేశారని నివేదిక ద్వారా తేలింది. మొత్తంగా ఇప్పుడు మోడీకి ఈ నివేదిక కొంత మనోబలాన్ని ఇచ్చిందనే చెప్పాలి.