మోడీ ఇప్పుడే నేపాల్‌ వెళ్లాలా?

ఇది కోడ్‌ ఉల్లంఘన కిందకే వస్తుందన్న గెహ్లాట్‌
బెంగళూరు,మే12(జ‌నం సాక్షి ):  దేశవ్యాప్తంగా ఆసక్తిగా ఎదురుచూస్తోన్న కర్ణాటక ఎన్నికల పోలింగ్‌  సమయంలో ప్రధాని విదేశీ పర్యటన చేయడాన్ని కాంగ్రెస్‌ నేతలు తప్పు పట్టారు. కాంగ్రెస్‌ ప్రధాన కార్యదర్శి అశోక్‌ గెహ్లాట్‌ మాట్లాడుతూ..’ ఎన్నికల కోడ్‌ అమలులో ఉన్నప్పుడు పీఎం స్థాయిలో ఉన్న వ్యక్తి విదేశాలు వెళ్లడం ఏంటి?. ఓటర్లను ప్రభావితం చేయడానికే ఆయన ఇప్పుడు ఈ పర్యటనకు వెళ్లాలని నిర్ణయించుకున్నట్లున్నారు. ఆయనకు ఇప్పుడే సమయం దొరికిందా? ఎన్నికల కోడ్‌ను ఉల్లంఘించడం ప్రజాస్వామ్యాన్ని దెబ్బతీయడమే. మోదీ నిర్ణయం ప్రజాస్వామ్యంపై ప్రభావం చూపుతుంది’. అని అన్నారు. మోదీ శనివారం నేపాల్‌లోని ముక్తినాథ్‌, పశుపతినాథ్‌ ఆలయాలను సందర్శించుకున్నారు. అయితే ఈ రెండు ఆలయాల్లోనూ శివుడు జ్యోతిర్లింగ స్వరూపుడు.కర్ణాటకలోని లింగాయత్‌లు శివుణ్ని ఈ రూపంలోనే పూజిస్తారు. దీని ద్వారా అక్కడి ప్రజల్ని ప్రభావితం చేయచ్చనే ఉద్దేశంతోనే మోదీ అక్కడికి వెళ్లినట్లు కాంగ్రెస్‌ ఆరోపిస్తోంది. దీంతోపాటు మరికొందరు కాంగ్రెస్‌ నేతలు కూడా మోదీ పర్యటనపై విమర్శలు గుప్పించారు. అయితే మోదీ ఎన్ని గిమ్మిక్కులు చేసినా కర్ణాటకలో గెలుపు మాత్రం కాంగ్రెస్‌దేనని కాంగ్రెస్‌ సీనియర్‌ నేత మల్లిఖార్జున ఖర్గే అన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలు కాంగ్రెస్‌ వైపే మొగ్గు చూపుతున్నారని అభిప్రాయ పడ్డారు. బసవ నగర్‌లో ఓటు హక్కు వినియోగించుకున్న అనంతరం ఆయన విూడియాతో మాట్లాడారు.రాష్ట్రవ్యాప్తంగా 222 అసెంబ్లీ స్థానాలకు ఈరోజు పోలింగ్‌ జరుగుతోంది. ఈ ఫలితాలు మే 15న వెలువడనున్నాయి.