మోడీ నేపాల్‌ పర్యటనలో కర్నాటక రాజకీయం

వ్యూహాత్మకంగానే పర్యటన అంటున్న బిజెపి శ్రేణులు?
జనక్‌పూర్‌,మే11(జ‌నం సాక్షి ):  ప్రధాన మంత్రి నరేంద్ర మోదీకి శుక్రవారం  రెండు రోజుల పర్యటన నిమిత్తం ఆయన నేపాల్‌ చేరుకున్నారు. సీతా దేవి జన్మస్థలమైన జనక్‌పూర్‌లోని జానకి దేవాలయంలో ఆయన ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఇక్కడి నుంచే అయోధ్యకు బస్సును ప్రారంభించారు. అయితే నేపాల్‌లో పర్యటిస్తున్న ఆయన దృష్టి, వ్యూహం అంతా కర్నాటక ఎన్నికలపైనే ఉందని పార్టీ శ్రేణులు భావిస్తున్నాయి.
కర్ణాటక ఎన్నికల పోలింగ్‌కు ఒక రోజు ముందు, పోలింగ్‌ రోజు కావడం చాలా కీలకం. సీజన్మించిన స్థంలో పర్యటించడం, అయోధ్యకు బస్సును నడపడం అంతా ఓటర్లకు గాలం వేయడమేనని అంటున్నారు. కేవలం హిందూ ఓట్లను ఆకర్శించేందుకే ఈ పర్యటన సాగుతోందన్న వాదనా ఉంది. ప్రధాని మోడీ తన మేధాశక్తినంతటినీ ఉపయోగించి ఈ పర్యటనను ఖరారు చేసుకున్నట్లు భావించవలసి వస్తుంది. ఎందుకంటే గతంలో గుజరాత్‌ ఎన్నికల సమయంలో కూడా సముద్రంపై ప్రయాణించే విమానంలో ప్రయాణించి విూడియా ద్వారా రాష్ట్రం మొత్తం దృష్టిని తనవైపు తిప్పుకోగలిగారు. గుజరాత్‌ ఎన్నికల ప్రచారం గడువు
ముగిసిన తర్వాత ఆయన ఈ విధంగా చేశారు. 2014లో కూడా దేశంలో కొన్ని ప్రాంతాల్లో ఓటింగ్‌ జరుగుతుండగా వారణాసిలో భారీ ర్యాలీ నిర్వహించి, ప్రజల దృష్టిని ఆకర్షించారు. ఇటువంటి చర్యల వల్ల కొద్దో గొప్పో బీజేపీకి లాభిస్తున్నట్లు ఆ పార్టీ వర్గాలు భావిస్తున్నాయి. తాజాగా కర్ణాటక శాసనసభ ఎన్నికల ప్రచార గడువు ముగిసింది. శుక్రవారం ఆయన నేపాల్‌లో సీతా దేవి ఆలయాన్ని సందర్శించి, అమ్మవారికి ప్రత్యేక పూజలు చేశారు. అయోధ్యలో శ్రీరాముడు జన్మించాడు, జనక్‌పురిలో సీతాదేవి జన్మించింది. ఈ రెండు ప్రదేశాలను కలుపుతూ బస్సు రూటును ప్రకటించారు. . సరిగ్గా కర్ణాటక ఓటర్లు ఓటు వేసే రోజు శనివారం ఆయన పశుపతినాథ్‌, ముక్తినాథ్‌ దేవాలయాలను సందర్శిస్తారు. ప్రత్యేక పూజలు చేస్తారు. సహజంగానే ఈ కార్యక్రమాలను విూడియా ప్రసారం చేస్తుంది.  ఎన్నికల ప్రచారం నిర్వహించడానికి నేరుగా అవకాశం లేని సందర్భంలో ఆయన విదేశానికి వెళ్ళి, అక్కడి ప్రముఖ దేవాలయాల్లో పూజలు చేయడం ద్వారా గొప్ప ప్రచారం పొందుతారు. లింగాయత్‌లకు శివుడు ఆరాధ్య దైవం కావడంతో మోదీ పశుపతినాథ్‌, ముక్తినాథ్‌ దేవాలయాలను సందర్శించడం వల్ల లింగాయత్‌ ఓటర్లపై ఆ ప్రభావం ఉంటుందని బీజేపీ వర్గాలు ఆశిస్తున్నాయి. ఇదే మోదీ చాణక్యమని, ఆయనకు సమయం విలువ బాగా తెలుసునని సంబరపడుతున్నాయి.