మోదీకి ముప్పు పొంచి ఉంది..!

– రోడ్‌షోలు వద్దంటున్న నిఘా సంస్థలు
– ఎవ్వరినీ ప్రదాని దగ్గరకు అనుమతించొద్దు
– మంత్రులైనా సరే.. ప్రత్యేక భద్రతా సిబ్బంది అనుమతి పొందాల్సిందే
– రాష్ట్రాలకు నిఘా సంస్థల హెచ్చరికలు
న్యూఢిల్లీ,జూన్‌26(జ‌నం సాక్షి): ప్రధాన మంత్రి నరేంద్ర మోదీకి ముప్పు పొంచి ఉందని నిఘా సంస్థలు ఆయా రాష్ట్రాలను హెచ్చరించాయి. ప్రధాని పర్యటన సమయాల్లో అప్రమత్తంగా ఉండాలని అన్ని రాష్ట్రాలకు సందేశమిచ్చాయి. ఈ నేపథ్యంలో కేంద్ర ¬ం శాఖ ప్రధాని సంరక్షణకు తగిన జాగ్రత్తలు తీసుకుంటోంది. ఎవ్వరినీ ప్రధానికి దగ్గరగా వెళ్లేందుకు అనుమతించొద్దని.. చివరకు అధికారులు, మంత్రులైనా సరే మోదీకి సంబంధించిన ప్రత్యేక భద్రతా సిబ్బంది నుంచి అనుమతి పొందిన తర్వాతే ఆయనను కలిసేలా ఏర్పాట్లు చేస్తోంది. ప్రధానికి ముప్పు పొంచి ఉందని హెచ్చరిస్తూ ¬ంశాఖ అన్ని రాష్ట్రాల్లోని పోలీస్‌ చీఫ్‌లకు లేఖలు రాసింది. 2019 సార్వత్రిక ఎన్నికలకు సంబంధించి ప్రధాని మోదీనే అత్యధిక ప్రాధాన్యత గల లక్ష్యంగా ఉన్నారని జాతీయ భద్రతా కౌన్సిల్‌ ఇతర ఏజెన్సీలకు తెలిపింది. మోదీ రక్షణ గురించి ఏజెన్సీలు ప్రశ్నించగా కౌన్సిల్‌ ఈ విధంగా వెల్లడించింది. ఇటీవల నక్సలైట్ల నుంచి కూడా మోదీకి ముప్పు ఉందని ఓలేఖ ద్వారా విషయం వెలుగులోకి వచ్చిన సంగతి తెలిసిందే. రోడ్‌షోల సమయంలో మోదీ హత్యకు కుట్ర పన్నారని ఇటీవల పుణె పోలీసులు ఆరోపించారు. వచ్చే సార్వత్రిక ఎన్నికల కోసం భాజపా తరఫున ప్రచారంలో పాల్గొనే ప్రముఖ వ్యక్తి మోదీనే. అయితే ఆయనను రోడ్‌షోలు చేయొద్దని, ప్రచార ప్రణాళికలు, ఓ చోటు నుంచి మరో చోటుకు ఏ మార్గంలో వెళ్తారనే విషయాలను బహిర్గతం చేయకపోవడమే మంచిదని నిఘా వర్గాలు సూచిస్తున్నట్లు సమాచారం. ఎల్లప్పుడూ ప్రధాని చుట్టూ ఉండే భద్రతాసిబ్బందికి ¬ం శాఖ అధికారులు ప్రత్యేక సూచనలు ఇచ్చారు. అవసరం లేకుండా మోదీకి దగ్గరగా ఎవ్వరినీ రానీయొద్దని చెప్పారు. ఈ బృందం ఎప్పుడూ మోదీకి దగ్గరలోనే ఉంటుంది. మోదీ ప్రజలకు దగ్గరగా వెళ్లే సందర్భాలను కూడా బాగా తగ్గించాలని ¬ంశాఖ భావిస్తున్నట్లు తెలుస్తోంది. మోదీ వెంట ఉండే కమెండోలను కూడా పెంచనున్నారు.