మోసాలకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవు

– ఎస్సై గొల్లపల్లి విజయలక్ష్మి
చండ్రుగొండ   జనంసాక్షి (జూన్ 06) : ప్రభుత్వ ఖజానాకు గండి కొడుతూ  మోసాలకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవని ఎస్సై గొల్లపల్లి   విజయలక్ష్మి హెచ్చరించారు. పొంతనలేని పాత బిల్లుల తో  మణుగూరు నుండి  పెనుబల్లి   దిగుమతి కి వెళ్తున్న  ఇసుక లారీని చండ్రుగొండ ప్రధాన సెంటర్ లో  గురువారం తెల్లవారుజామున ఆమె   పట్టుకున్నారు. వాహనాన్ని    సీజ్ చేసి   కేసు నమోదు చేశారు. ఈ సందర్బంగా ఆమె మాట్లాడుతూ  అమాయక ప్రజల అవసరాలను  అవకాశంగా  మార్చుకొని  కొంతమంది  మోసాలకు పాల్పడుతున్నారని అటు  ప్రభుత్వ ఆదాయాన్ని  గండి కొట్టడంతో పాటు  వేబ్రిడ్జి కాటా బిల్లుల ద్వారా మోసాలకు పాల్పడుతున్నారని ప్రజలు అప్రమత్తంగా ఉండాలన్నారు.  అనుమానం వచ్చిన వ్యక్తులపై తమకు సమాచారం ఇవ్వాలన్నారు. మోసాలకు పాల్పడే వారు  ఎంతటివారైనా  వదిలే ప్రసక్తే లేదని  తేల్చి చెప్పారు. కాగా ఇటీవల  కాలంలో  అక్రమ ఇసుక రవాణాపై పోలీసులు ఉక్కుపాదం మోపడంతో  గోదావరి ఇసుక వాడకం పెరిగింది. దాన్ని ఆసరాగా చేసుకున్న కొంతమంది  అక్రమార్కులు చేతివాటం ప్రదర్శించడం  తప్పుడు బిల్లులు సృష్టించడం ద్వారా   అడ్డంగా దొరికిపోతున్నారు. అక్రమ దందాపై  కఠినంగా వ్యవహరిస్తున్న మహిళా ఎస్సై ను మండల ప్రజలు  అభినందిస్తున్నారు.