మ్యాగీ నూడుల్స్‌పై తెలంగాణ నిషేధం, స్టాక్ వెనక్కి తీసుకున్న నెస్లే

7rk1z29aన్యూఢిల్లీ: మ్యాగీ నూడుల్స్ పైన రాష్ట్రాల నుండి కేంద్రం నివేదికను కోరింది. కేంద్రం అన్ని రాష్ట్రాల నుంచి నివేదికలు కోరిందని ఆరోగ్య శాఖ మంత్రి జేపీ నడ్డా గురువారం చెప్పారు. కేంద్రానికి ఈ నివేదికలు అందిన తర్వాత దీనిపై ఒక నిర్ణయం తీసుకుంటామన్నారు. గురువారం తాజాగా మరో నాలుగు రాష్ట్రాలు మ్యాగీ నూడుల్స్ అమ్మాకాలపై నిషేధం విధించాయి. మ్యాగీ నూడుల్స్‌లో సీసం శాతం ఎక్కువగా ఉన్నట్లు శాంపిల్స్ పరీక్షలో తేలడంతో అనేక రాష్ట్రాల్లో దుకాణాలు, స్టోర్స్‌లను మ్యాగీ నూడుల్స్‌ను ఉపసంహరించుకున్నాయి. కేంద్రమంత్రిని మిగతా ప్యాకేజ్డ్ ఆహార ఉత్పత్తుల భద్రతా ప్రమాణాలను చెక్ చేయడం గురించి అడగ్గా, అది నిరంతరంగా సాగే ప్రక్రియ అని మంత్రి తెలిపారు. మ్యాగీ నూడుల్స్‌లో అనుమతించిన స్థాయికన్నా మించి ఆరోగ్యానికి హాని చేసే సీసం లాంటి పదార్థాలున్నట్లు శాంపిల్స్ పరీక్షలో తేలడంతో ఢిల్లీ, ఉత్తర ప్రదేశ్, బీహార్, పశ్చిమ బెంగాల్, హర్యానా, కర్నాటక, లాంటి అనేక రాష్ట్రాలు మ్యాగీ నూడుల్స్ అమ్మకాలపై నిషేధం విధించాయి. తెలంగాణ ప్రభుత్వం కూడా మ్యాగీ నూడుల్స్ పైన నిషేధం విధించింది.  ఆర్మీ క్యాంటీన్లతో పాటు బిగ్ బజార్, వాల్‌మార్ట్‌లాంటి స్టోర్స్‌లనుంచి కూడా ఈ ఉత్పత్తులను ఉపసంహరించుకున్నాయి. గురువారం తాజాగా గుజరాత్, జమ్మూ, కాశ్మీర్, ఉత్తరాఖండ్, తమిళనాడు రాష్ట్రాలు కూడా మ్యాగీ నూడుల్స్ అమ్మకాలపై నిషేధం విధించాయి. నేపాల్లోను నమూనాలు సేకరించారు. దేశవ్యాప్తంగా వెనక్కి తీసుకున్న నెస్లే మ్యాగీ నూడుల్స్ పైన ఆరోపణలు రావడంతో నెస్లే కాస్త ఆలస్యంగానైనా స్పందించింది. నిన్నటిదాకా అలాంటివేమీ లేవంటూ చెప్పిన నెస్లే.. తాజాగా నూడిల్స్‌కు సంబంధించి దేశవ్యాప్తంగా మార్కెట్లో ఉన్న స్టాకును వెనక్కి తీసుకునేందుకు సిద్ధమని చెప్పింది. కంపెనీ నుండి ప్రకటన వెలువడింది.