యడియూరప్ప సర్కార్‌ సేఫ్‌!

– కర్ణాటక ఉప ఎన్నికల్లో కమలం హవా
– 12చోట్ల బీజేపీ అభ్యర్థుల జయభేరి
– 117ఎమ్మెల్యేలకు చేరిన యెడియూరప్ప సర్కార్‌ బలం
బెంగళూరు, డిసెంబర్‌9(జ‌నంసాక్షి) : కర్ణాటకలో బీజేపీ సుస్థిర పాలనకు మార్గం సుగమమైంది. సోమవారం వెలువడిన ఉప ఎన్నికల్లో ఫలితాల్లో ఆపార్టీ అభ్యర్థులు 12మంది విజయదుందబి మోగించడంతో బీజేపీ ప్రభుత్వం ఊపిరిపీల్చుకుంది. నిన్నటివరకు 105 మంది ఎమ్మెల్యేలతో ఎప్పుడు ఏం జరుగుతుందో తెలియని స్థితిలో పాలన సాగించిన యడియారప్ప ప్రస్తుతం 117 మంది సభ్యులతో పాలన సాగించనున్నారు. సోమవారం వెలువడిన ఫలితాల్లో అత్యధిక స్థానాల్లో విజయం సాధించడంతో కర్ణాటక సీఎం యెడియూరప్ప, బీజేపీ నేతలు సంతోషం వ్యక్తంచేశారు. ఎంతో ఉత్కంఠగా సాగిన 15అసెంబ్లీ స్థానాల ఉప ఎన్నికల్లో భాజపా 12చోట్ల జయభేరీ మోగించింది. ఇక కాంగ్రెస్‌ కేవలం 2 స్థానాలకే పరిమితమవగా.. జేడీఎస్‌ కనీసం ఖాతా తెరవలేకపోయింది. మరో చోట స్వతంత్ర అభ్యర్థి విజయం సాధించారు. ఈ ఎన్నికల్లో భాజపా, కాంగ్రెస్‌ మొత్తం 15 చోట్ల పోటీ చేయగా.. జేడీఎస్‌ 12 చోట్ల బరిలోకి దిగింది. ఫలితాల్లో గోకాక్‌, కాగవాడ, అథణి, యల్లాపుర, రాణెళిబెన్నూరు, హీరెకెరూరు, కె.ఆర్‌. పురం, మహాలక్ష్మిలేఔట్‌, యశవంతపుర, విజయనగర, కె.ఆర్‌. పేట, చిక్కబళ్లాపుర నియోజకవర్గాల్లో భాజపా అభ్యర్థులు విజయం సాధించారు. హణసూరు, శివాజినగరలో కాంగ్రెస్‌ గెలుపొందింది. హళసకోటె నియోజకవర్గంలో స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసిన భాజపా రెబల్‌ నేత శరత్‌ కుమార్‌ గౌడ విజయం సాధించారు. అయితే, ఆయన కూడా తిరిగి భాజపాలో చేరే అవకాశాలు కన్పిస్తున్నాయి. కాంగ్రెస్‌-జేడీఎస్‌ కూటమికి చెందిన 17మంది తిరుగుబాటు చేయడంతో కర్ణాటకలో కుమారస్వామి నేతృత్వంలోని సంకీర్ణ ప్రభుత్వం కూలిపోయిన విషయం తెలిసిందే. ఆ తర్వాత తిరుగుబాటు ఎమ్మెల్యేలపై నాటి స్పీకర్‌ అనర్హత వేటు వేయడం.. ఆ వ్యవహారం సుప్రీంకు వెళ్లడం.. కోర్టు ఆదేశాల మేరకు జరిగిన బలపరీక్షలో భాజపా నెగ్గి యడియూరప్ప సర్కార్‌ ఏర్పడటం చకచకా జరిగిపోయాయి. కాగా.. స్పీకర్‌ చర్యతో అసెంబ్లీలో సభ్యుల సంఖ్య 224 నుంచి 207కు పడిపోయింది. ఇక ఎమ్మెల్యేల అనర్హతతో 17స్థానాలకు ఉపఎన్నికలు నిర్వహించాల్సి ఉండగా హైకోర్టులో కేసుల కారణంగా రెండు చోట్ల ఎన్నికలు వాయిదా పడ్డాయి. దీంతో డిసెంబరు 5న 15 శాసనసభ నియోజకవర్గాలకు ఉప ఎన్నికలు నిర్వహించారు. ప్రస్తుతం అసెంబ్లీలో భాజపా సంఖ్యా బలం 105. తాజా ఫలితాల్లో మరో 12 చోట్ల గెలుపొందడంతో భాజపా బలం 117కు పెరిగింది. అంటే రాష్ట్రంలో స్థిరమైన ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు అవసరమైన స్పష్టమైన మెజార్టీ కాషాయ పార్టీకి దక్కింది. అలా యెడియూరప్ప ప్రభుత్వం తిరిగి అధికారాన్ని నిలబెట్టుకుంది
బీజేపీకి ఇది గొప్ప విజయం – సీఎం యెడియూరప్ప
ఉప ఎన్నికల ఫలితాల్లో 15 స్థానాలకు బీజేపీ 12 స్థానాల్లో గెలవడం తమ పార్టీకి గొప్ప విజయమని కర్ణాటక సీఎం యెడియూరప్ప స్పష్టం చేశారు. ఎన్నికల ఫలితాల అనంతరం ఆయన విలేకరులతో మాట్లాడారు.. ఇప్పటికైనా ప్రతిపక్షం తమపై ఆరోపణలు చేయడం మానాలని సూచించారు. ప్రభుత్వానికి సహకరించాలని కోరారు. రాబోయే మూడున్నరేండ్లు కర్ణాటకలో సుస్థిర ప్రభుత్వం కొనసాగుతోందని యెడియూరప్ప తేల్చిచెప్పారు. ఈ ఉప ఎన్నికల్లో గెలిచిన ఎమ్మెల్యేలకు మంచి భవిష్యత్‌ ఉంటుందని సీఎం హావిూనిచ్చారు. వీరికి ప్రభుత్వంలో ఉన్నత పదవులిచ్చే అంశంపై రెండు, మూడు రోజుల్లో ఢిల్లీ వెళ్లి
పార్టీ పెద్దలతో మాట్లాడుతానని సీఎం యెడియూరప్ప పేర్కొన్నారు. ఇదిలా ఉంటే కర్ణాటక ఉప ఎన్నికల్లో బీజేపీ విజయదుందబి మోగించడంతో ఇదిలా ఉంటే ఉప పోరులో 12 మంది ఎమ్మెల్యేలను గెలుచుకోవటంతో యెడియూరప్ప కుమారుడు విజయేంద్రతో సంబరాలు జరుపుకున్నారు. తండ్రి యెడియూరప్ప కుమారుడు ఒకరినొకరు స్వీట్లు తినిపించుకున్నారు. ఈ సందర్భంగా విజయేంద్ర తండ్రి ఆశీర్వాదాన్ని తీసుకున్నారు.
ఓటమిని అంగీకరిస్తున్నాం –  కాంగ్రెస్‌ నేత డీకే శివకుమార్‌
కర్ణాటక ఉప ఎన్నికల ఫలితాల్లో అధికార భాజపా అభ్యర్థులు విజయంపై ఆ రాష్ట్ర మాజీ మంత్రి, కాంగ్రెస్‌ సీనియర్‌ నేత డీకే శివకుమార్‌ స్పందించారు. ఈ 15 నియోజకవర్గాల్లో ప్రజల తీర్పును స్వీకరిస్తున్నామని, ఫిరాయింపుదారులను ప్రజలు ఒప్పుకున్నారని, అందుకే మేం ఓటమిని అంగీకరిస్తున్నామని అన్నారు. ఇందుకు మేం బాధపడాల్సిన అవసరం లేదని వ్యాఖ్యానించారు.