యూపిలో మహిళల రక్షణకు పోలీసుల చర్యలు

రాత్రివేళ ఒంటరి మహిళలకు ఎస్కార్ట్‌

లక్నో,డిసెంబర్‌10(జ‌నంసాక్షి): ఉత్తరప్రదేశ్‌లో మహిళలపై జరుగుతున్న అఘాయిత్యాలకు అడ్డుకట్ట వేసేందుకు ఆ రాష్ట్ర పోలీసులు చర్యలు తీసుకుంటున్నారు. రాత్రి 10 గంటల నుంచి ఉదయం 6 గంటల వరకు ఒంటరిగా వెళ్లే మహిళలకు పోలీసులు ఎస్కార్ట్‌ ఇవ్వనున్నారు. తామున్న ప్రదేశం నుంచి చేరుకోవాల్సిన గ్యమస్థానానికి ఒంటరిగా వెళ్లే మహిళలకు మాత్రమే ఎస్కార్ట్‌ ఇవ్వనున్నట్లు యూపీ డీజీపీ ఓపీ సింగ్‌ స్పష్టం చేశారు. ఈ మేరకు యూపీలోని అన్ని పోలీసు స్టేషన్లకు ఉత్తర్వులు జారీ చేశారు. 112కు డయల్‌ చేస్తే పోలీసు రెస్పాన్స్‌ వెహికిల్స్‌(పీఆర్వీ)కు సమాచారం అందుతుందని.. ఆ తర్వాత సదరు మహిళ వివరాలు చెప్తే అక్కడ్నుంచి ఎస్కార్ట్‌ ఇస్తారని తెలిపారు. ఇక ఎస్కార్ట్‌లో ఇద్దరు మహిళా పోలీసులు ఉండేలా చర్యలు తీసుకోవాలని డీజీపీ ఆదేశాలు జారీ చేశారు. దీనిపై మహిళా పోలీసులకు శిక్షణ ఇవ్వనున్నారు పోలీసు ఉన్నతాధికారులు. గత వారం యూపీలోని ప్రైవేటు కంపెనీలతో డీజీపీ సమావేశమై మహిళా ఉద్యోగినుల భద్రతపై చర్చించారు. మహిళా ఉద్యోగినుల సురక్షిత ప్రయాణానికి ప్రత్యేక చొరవ తీసుకోవాలని ప్రైవేటు కంపెనీలకు డీజీపీ ఆదేశాలు జారీ చేశారు.