యూపీఏకు పరీక్ష సమయం
ఎఫ్‌డిఐలపై మద్దతుకు కాంగ్రెస్ కసరత్తు
రంగంలోకి దిగిన సీనియర్ నేతలు
నేడు షిండేతో టి-కాంగ్రెస్ నేతలు భేటీ
సస్పెన్స్ కొనసాగిస్తున్న బిఎస్పీ, కాంగ్రెస్‌కు ఎస్పీ ఝలక్
న్యూఢిల్లీ, డిసెంబర్ 3 : ఎఫ్‌డిఐలపై మంగళవారం నుంచి రెండురోజులపాటు లోక్‌సభలో ఓటింగ్‌తో కూడిన చర్చ ప్రారంభం కానున్న నేపథ్యంలో తమపార్టీ సభ్యులు, మిత్రపక్ష సభ్యులను కూడగట్టేందుకు కాంగ్రెస్ ప్రయత్నాలు ముమ్మరం చేసింది. మంగళవారం ఉదయం 10:30గంటలకు తెలంగాణ ప్రాంత కాంగ్రెస్ నేతలతో కేంద్రమంత్రులు సుశీల్ కుమార్ షిండే, కమల్‌నాథ్‌లు భేటీ కానున్నారు. ఎంపీలతో పాటు ఆ ప్రాంత కేంద్రమంత్రులను కూడా హజరుకావాల్సిందిగా వారు కోరారు. ఈ మేరకు వారికి అధిష్టానం నుంచి పిలుపు అందింది. ఎంపీలతో పాటు తెలంగాణ ప్రాంతానికి చెందిన కేంద్రమంత్రులు జైపాల్‌రెడ్డి,సర్వే సత్యనారాయణ, పోరిక బలరామ్ నాయక్‌లకు కూడా పిలుపు వెళ్లింది. ఎఫ్‌డిఐలను ప్రతిపక్షాలతో పాటు యూపిఏలోను బయటి నుండి మద్దతు ఇస్తున్న పలు పార్టీలు కూడా వ్యతిరేకిస్తున్నాయి. దీంతో ఎఫ్‌డిఐలపై కాంగ్రెస్ ఆందోళన చెందుతోంది. ఇతర పార్టీతో పాటు తెలంగాణ వాదం వినిపిస్తున్న ఎంపీలు గైర్హాజరు కాకుండా ఉండేందుకు వారిని బుజ్జగించే ప్రయత్నాలు చేపట్టింది.
ఇప్పటి వరకు యూపిఏ ప్రభుత్వానికి వెలుపలి నుంచి మద్దతు ఇస్తున్న సమాజ్‌వాది, బహుజన్ సమాజ్ పార్టీలు చివరి క్షణంలో కాంగ్రెస్‌కు ఝలక్ ఇచ్చాయి. ఇప్పటి వరకు ఎఫ్‌డిఐలపై బిఎస్పీ స్పష్టమైన వైఖరిని ప్రకటించలేదు. లోక్‌సభలోనే తమ వైఖరిని స్పష్టం చేస్తామని బిఎస్పీ అధినేత్రి మాయావతి సోమవారంనాడు చెప్పారు. ఓటింగ్ జరిగే సమయం సమీపిస్తున్నా బిఎస్పీ ఇంకా సస్పెన్స్ కొనసాగిస్తోంది. మరోవైపు సమాజ్‌వాదిపార్టీ కూడా కాంగ్రెస్‌కు మొండి చేయ్యి చూపింది. రాజ్యసభలో ఎఫ్‌డిఐల అంశంపై జరిగే ఓటింగ్‌కు తాము దూరంగా ఉంటామని లోక్‌సభలో మాత్రం ఓటింగ్‌లో పాల్గొని ప్రభుత్వ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తామని సమాజ్‌వాది పార్టీ ఎంపీ రాంగోపాల్ యాదవ్ ఇప్పటికే ప్రకటించారు. పార్టీ అధినేత ములాయం సింగ్ ఆదేశాల మేరకే ఆయన ఆ ప్రకటన చేసినట్టు తెలుస్తోంది. ఎఫ్‌డిఐల అంశంపై మిత్రపక్షాలను బుజ్జగించేందుకు ప్రధాని మన్‌మోహన్‌సింగ్ విందు దౌత్యం నెరపిన విషయం తెలిసిందే. ఇలాంటి పరిస్థితుల్లో డిఎంకె అధినేత కరుణానిధి యూపిఏ ప్రభుత్వానికి బాసటగా నిలిచారు. మతతత్వ శక్తులను అధికారానికి దూరంగా ఉంచేందుకు తాము యూపిఏకి మద్దతునిస్తున్నామని ప్రభుత్వాన్ని పడనీయబోమని ప్రకటించారు. అయితే చివరి క్షణంలో డిఎంకె వంటి మిత్రపక్షం మనసు మార్చుకుంటే మాత్రం ప్రభుత్వానికి గండం తప్పదు. ఎఫ్‌డిఐల అంశంపై విబేధించి యూపిఏ నుంచి వైదొలగిన తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి మమత కూడా ఆఖరి క్షణంలో ఎలాంటి నిర్ణయం తీసుకుంటారోనని ఎదురుచూస్తున్నారు. ఇదే అంశంపై తృణమూల్ ప్రవేశపెట్టిన అవిశ్వాస తీర్మానం మొగ్గ దశలో వీగిపోయింది. అనంతరం జరిగిన అఖిలపక్ష సమావేశంలో కూడా చర్చ ఏ రూపంలో జరపాలన్న విషయమై స్పీకరే నిర్ణయించాలంటూ తృణమూల్ నర్మగర్భంగా వ్యాఖ్యానించింది. ఈనేపథ్యంలో 4,5 తేదీలలో జరగనున్న చర్చ, ఓటింగ్ సమయంలో సాధ్యమైనంత ఎక్కువ మంది సభ్యుల మద్దతు కూడగట్టేందుకు కాంగ్రెస్ సీనియర్ నేతలు రంగంలోకి దిగారు.