యోగాను ఆరోగ్య సాధనంగా మలుచుకోవాలి

ప్రపంచ దేశాలు యోగాను అనుసరిస్తున్నాయి
డెహ్రాడూన్‌లో అంతర్జాతీయ యోగా దినోత్సవంలో పాల్గొన్న ప్రధాని మోదీ
డెహ్రాడూన్‌, జూన్‌21(జ‌నం సాక్షి) : యోగా సాధనతో శాంతి, ఆరోగ్యం, సంతోషం ప్రాప్తిస్తాయని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా ఉత్తరాఖండ్‌ రాజధాని డెహ్రాడూన్‌లో నిర్వహించిన యోగా కార్యక్రమంలో మోదీ పాల్గొన్నారు. ప్రజలతో కలిసి ఆయన యోగా సాధన చేశారు. ఈ సందర్భంగా ప్రధాని మాట్లాడుతూ… ఉత్తరాఖండ్‌ అనేక దశాబ్దాలుగా యోగా, ఆయుర్వేదిక్‌కు ముఖ్య కేంద్రంగా వర్ధిల్లుతోందన్నారు. యోగా.. కుటుంబం, సమాజంలో సద్భావన కలిగిస్తుందన్నారు. డెహ్రాడూన్‌ నుంచి డబ్లిన్‌ వరకు, షాంఘై నుంచి షికాగో వరకు అన్ని దేశాల ప్రజలు యోగాలో నిమగ్నమయ్యారని తెలిపారు. నేడు ప్రతి దేశం యోగాను తమ దైనందిన జీవితంలో భాగం చేసుకున్నాయని మోదీ పేర్కొన్నారు. అతి తక్కువ సమయంలోనే యోగానే ప్రపంచవ్యాప్తమైందన్నారు. యోగాను భారత్‌తో పాటు ప్రపంచ దేశాలు అనుసరిస్తున్నాయన్నారు. సూర్యుడి కిరణాలు అన్నివైపులా చేరినట్లే యోగా కూడా అంతటా చేరువవుతోందని పేర్కొన్నారు. యోగా అనేది ప్రాచీన, ఆధునిక ఆరోగ్య సాధనమని.. ప్రతి ఒక్కరూ దీన్ని ఆరోగ్య సాధనంగా మలుచుకోవాలని పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా ప్రధాని యోగాసనాలు వేశారు.